టిప్పు సుల్తాన్‌ పేరు తొలగించిన మహా సర్కార్‌.. బీజేపీ సంబురాలు

27 Jan, 2023 20:43 IST|Sakshi

ముంబై: మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వంలో ఉద్దవ్‌ థాక్రే సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని.. తాజాగా షిండే సర్కార్‌ రద్దు చేసింది. ముంబై మలాద్‌ ప్రాంతంలోని ఓ పార్క్‌కు టిప్పు సుల్తాన్‌ పేరును తొలగిస్తున్నట్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సకల్‌ హిందూ సమాజ్‌, బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. 

ఈ మేరకు బీజేపీ నేత, ముంబై సబర్బన్‌ డిస్ట్రిక్‌ గార్డియన్‌ మినిస్టర్‌ మంగళ్‌ ప్రభాత్‌ పేరు తొలగింపునకు సంబంధించిన ఆదేశాలను కలెక్టర్‌కు జారీ చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆ బ్యానర్‌ను తొలగించారు. అంతేకాదు.. ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. అసలు ఆ పేరు ఉండాలని ఎవరూ అక్కడ కోరుకోలేదని ఆయన అంటున్నారు. ఉన్నపళంగా గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, టిప్పు సుల్తాన్‌ పేరుతో ఓ బ్యానర్‌ వెలిసిందని, ఆ సమయంలో అక్కడ నిరసనలు జరిగాయని గుర్తు చేశారాయన. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, ప్రజాభీష్టాన్ని గౌరవించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.

అష్ఫాఖుల్లా ఖాన్, బీఆర్‌ అంబేద్కర్‌.. ఇలాంటి మహనీయుల పేర్లను నిర్ణయించాలని బీజేపీ స్థానికులను కోరుతోంది. ఇదిలా ఉంటే.. ఈ నిర్ణయాన్ని ఎన్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు టిప్పు సుల్తాన్‌ పేరును ప్రభుత్వం ప్రతిపాదించిన సమయంలో బీజేపీ సైతం తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలోనూ టిప్పు సుల్తాన్‌ పట్ల వ్యతిరేకత కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు