ముంబైని వీడిన కంగన; కుక్క తోక వంకరే!

14 Sep, 2020 17:24 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ను ఉద్దేశించి శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నేక్‌ ఘాటు విమర్శలు చేశారు. ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన తన వ్యాఖ్యలను సమర్థించుకున్న ‘క్వీన్‌’తీరును తప్పుబట్టారు. ఈ మేరకు.. ‘‘ ఎంత ప్రయత్నించినా కుక్క తోకను సరిచేయడం ఎవరితరం కాదనే సామెత నాకు ఈరోజు బాగా అర్థమైంది’’అంటూ మరాఠీలో ట్వీట్‌ చేశారు. కంగన ముంబైని విడిచి వెళ్లిపోయిందని, గత వారం రోజులుగా ఆమెను సమర్థిస్తూ శివసేన ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ల ముఖాలు ఇప్పుడు మాడిపోయాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా ఇంకా గట్టిగా అరవండి అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. కాగా కంగన- శివసేనల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన వివాదం చినికి చినికి గాలివానలా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు తీవ్ర స్థాయిలో పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. (చదవండి: మనాలి చేరుకున్న కంగన.. ‘సోనియా సేన’పై ఫైర్‌!)

ఈ క్రమంలో సోమవారం ముంబైని వీడిన కంగన స్వస్థలం, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చండీగఢ్‌ ఎయిర్‌పోర్టులో మాట్లాడుతూ.. ‘‘ఇది వరకు ముంబైలో అడుగుపెడితే కన్నతల్లిని తాకిన అనుభూతి కలిగేది. ఇప్పుడు మాత్రం అక్కడికి వెళ్లిన తర్వాత కూడా నేను బతికి ఉంటాననంటే అదృష్టంగా భావించాల్సిన పరిస్థితి తలెత్తింది. శివసేన సోనియా సేనగా మారిన వేళ ముంబై పాలన భయంకరంగా మారింది’’ అంటూ మండిపడ్డారు. అదే విధంగా..  ముంబైలో తనకు ఎదురైన అనుభవాలు తాను చేసిన పీఓకే వ్యాఖ్యలు సరైనవేనని నిరూపించేలా ఉన్నాయంటూ మరోసారి ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శివసేన నేత ప్రతాప్‌ సర్నేక్‌ కంగనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా బాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారం నేపథ్యంలో కంగనపై విచారణ జరిపించాలంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఈ విషయంపై దృష్టి సారించాల్సిందిగా మహా సర్కారు ముంబై పోలీసులను శుక్రవారం ఆదేశించింది.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా