శివసేన వివాదం: షిండే వర్గానికి సుప్రీం నోటీసులు.. థాక్రే శిబిరం రిక్వెస్ట్‌కు నో

22 Feb, 2023 16:44 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: శివసేన పార్టీ పేరు, గుర్తును ఏక్‌నాథ్‌ షిండే(ప్రస్తుత మహరాష్ట్ర ముఖ్యమంత్రి) వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్దవ్‌ థాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా.. థాక్రే వర్గానికి ఊరట ఇవ్వలేదు దేశ అత్యున్నత న్యాయస్థానం. 

కానీ, థాక్రే వర్గ పిటిషన్‌కు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ షిండే క్యాంప్‌కు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఇక పార్టీ పేరు, గుర్తును ఒక వర్గానికి కేటాయించిన ఈసీ ఆదేశాలపై స్టే విధించాలని థాక్రే వర్గం సుప్రీంను అభ్యర్థించగా.. అందుకు మాత్రం నిరాకరించింది సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. వాళ్లు(షిండే శిబిరం) ఈసీ వద్ద విజయం సాధించారు. ఈ తరుణంలో స్టే విధించలేమంటూ బెంచ్‌ స్పష్టం చేసింది. అలాగే..

ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా లేని ఏదైనా చర్య తీసుకుంటే గనుక.. చట్టానికి సంబంధించిన ఇతర పరిష్కారాలను అనుసరించవచ్చని సుప్రీం కోర్టు థాక్రే శిబిరానికి సూచించింది. శివసేన ఉద్దవ్‌ బాలాసాహెబ్‌ థాక్రే పేరుతో పార్టీ పేరును..  వెలుగుతున్న టార్చ్‌ సింబల్‌ను గుర్తుగా ఉపయోగించుకోవచ్చన్న ఈసీ నిర్ణయాన్ని చీఫ్‌ జస్టిస్‌ ఈ సందర్భంగా పిటిషనర్‌కు సూచించారు.  ఆపై పిటిషన్‌పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు. 
 

మరిన్ని వార్తలు