‘గహ్లోత్‌ ఆనందం ఆవిరే’

4 Aug, 2020 15:45 IST|Sakshi

అమిత్‌ షా ఎక్కడున్నా చక్రం తిప్పుతారు : సేన

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో శివసేన కీలక వ్యాఖ్యలు చేసింది. అమిత్‌ షా ఐసోలేషన్‌లో ఉండటంతో రాజకీయ సంక్షోభం నెలకొన్న రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఊపిరిపీల్చుకునే అవకాశం లేదని పేర్కొంది. అమిత్‌ షా ఎక్కుడున్నా రాజకీయ సర్జరీలు చేయడంలో దిట్ట కావడంతో గహ్లోత్‌ సంతోషంగా ఉండలేరని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది. కాంగ్రెస్‌ నేత, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ తిరుగుబాటుతో గహ్లోత్‌ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బుధవారం భూమిపూజ జరగడానికి మించి అద్భుత క్షణాలు మరోటి లేవని వ్యాఖ్యానించింది. చదవండి : గల్వాన్ లోయ‌ను చైనాకు వదిలేశారా?

దేశంలో నెలకొన్న కోవిడ్‌-19 సంక్షోభం శ్రీరాముడి దీవెనలతో కనుమరుగవుతుందని పేర్కొంది. రామమందిర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బీజేపీ వృద్ధ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ వయోభారంతో కార్యక్రమానికి హాజరవడం​ లేదని, వీరు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొంటారని తెలిపింది. అయోధ్యలో భద్రతా ఏర్పాట్లను హోంమంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుండగా హోంమంత్రి అమిత్‌ షా కరోనా బారినపడి ఆస్పత్రిలో చేరడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ సహా పలువురు వీఐపీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా అమిత్‌ షా గైర్హాజరు లోటేనని పేర్కొంది. ఆయన సత్వరమే కోలుకోవాలని శివసేన ఆకాంక్షించింది.

మరిన్ని వార్తలు