ఆ రోజు బాల్‌ ఠాక్రే సాయం చేయకపోతే.. మోదీ ఇలా ఉండేవారా?: ఉద్దవ్‌ ఠాక్రే

13 Feb, 2023 12:04 IST|Sakshi

ముంబై: బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా.. శివసేన (యూబీటీ) ఎప్పుడూ హిందుత్వాన్ని వదులుకోలేదని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ఠాక్రే స్పష్టం చేశారు. ముంబైలో నివసిస్తున్న మరాఠీ ప్రజలు, ఉత్తర భారత ప్రజల మధ్య తామెప్పుడూ వివక్ష చూపలేదు, చూపబోమన్నారు. గత అపార్థాలను మనసులోంచి తొలగించుకోవాలని ఉత్తర భారత సమాజానికి విజ్ఞప్తి చేశారు.

ముంబైలో ఉత్తర భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ఉద్దవ్‌ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే మోదీని కాపాడకపోయి ఉంటే.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవారు కాదన్నారు. హిందుత్వ అంటే ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజలను విభజించడం కాదని అన్నారు.

‘‘నేను బీజేపీతో విభేదించాను, కానీ నేను హిందుత్వాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. బీజేపీ అంటే హిందుత్వ కాదు. ఒకరినొకరు ద్వేషించుకోవడం హిందుత్వం కాదు’’ అన్నారు. బీజేపీ హిందువుల మధ్య చీలికను సృష్టిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీ 25-30 ఏళ్లు రాజకీయపరమైన స్నేహబంధాన్ని కాపాడిందని గుర్తు చేశారు. మతంతో సంబంధం లేకుండా భారత్‌ను ద్వేషించేవారికే బాలాసాహెబ్ వ్యతిరేకమని ప్రస్తావించారు. 

కానీ బీజేపీ మాత్రం తమని వద్దనుకున్నారని వ్యాఖ్యానించారు. శివసేన, అకాలీదళ్‌తో ఉన్న సుదీర్ఘ బంధానికి బీటలు వారడాన్ని ఉద్దేశించి ఈ విధంగా  వ్యాఖ్యానించారు.. తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు బీజేపీతో పొత్తు నుంచి వైదొలిగినట్లు ఠాక్రే చెప్పారు.

‘‘లేకపోతే ఇప్పుడు నా మనుషుల్లో కొందరు మారినట్లే.. నేనూ నా మెడకు బెల్టు పెట్టుకుని బానిసగా పడి ఉండేవాడిని’ అని శివసేన (శిండే) వర్గాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. ఉత్తర భారతీయులను లేదా ముస్లింలను కలిసినప్పుడల్లా, హిందుత్వంపై ప్రశ్నించినప్పుడల్లా తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
చదవండి: ఆసియాలోనే అతిపెద్ద 'ఎయిర్ షో'.. ప్రారంభించిన మోదీ..

‘మీతో నా భేటీపై విమర్శలు వచ్చాయి.. ముస్లింలను కలిస్తే హిందుత్వాన్ని వదులుకున్నాడని నాపై ఆరోపణలు చేస్తారు. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ముంబై వచ్చినప్పుడు ఎవరి వంటింటిలోకి వెళ్లాడు? నేనే అలా చేసి ఉంటే ఈ పాటికి హిందూ వ్యతిరేకిని అయిపోయేవాడిని. కానీ ప్రధానమంత్రి అలా చేస్తే మాత్రం ఆయనది చాలా పెద్ద మనసని చెబుతారు. ఇదేం ద్వంద్వ వైఖరి? బోహ్రా వర్గానికి వ్యతిరేకంగా మేం ఎప్పుడూ లేం. వారు మాతోనే ఉన్నారు’ అని ఉద్ధవ్‌ స్పష్టం చేశారు. 

మహారాష్ట్రకు మంచి రోజు
ఇక భగత్‌సింగ్‌ కోశ్యారీ రాజీనామా ఆమోదంపై ఉద్ధవ్‌ స్పందిస్తూ... ఇది రాష్ట్రానికి మంచిరోజన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ పట్టాభిషికాన్ని ఉత్తర భారతదేశానికి చెందిన పూజారి జరిపించారని, ఈ రోజు శివాజీ మహరాజ్‌ను అవమానించిన వ్యక్తిని వెనక్కి పంపారని ఆయన అన్నారు.  

మరిన్ని వార్తలు