Video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురు చిన్నారులు.. భయంతో కేకలు, ఏడుపు

1 Dec, 2022 13:54 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని‌ ఘజియాబాద్‌ జిల్లాలో మరో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఓ సొసైటీ లిఫ్ట్‌లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవ‌త్సరాల వ‌య‌సున్న ముగ్గురు బాలికలు దాదాపు 25 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. ఘజియాబాద్‌లోని క్రాసింగ్స్ రిపబ్లిక్ టౌన్‌షిప్‌లో గల అసోటెక్ ది నెస్ట్‌లో న‌వంబ‌ర్ 29న ఈ ఘటన చోటుచేసుకుందిఈ దృశ్యాలన్నీ లిఫ్ట్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ముగ్గురు చిన్నారులు లిఫ్ట్‌లో ఉండ‌గా అది స‌డెన్‌గా ఆగిపోయింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేందుకు చిన్నారులు ఎంత ప్రయ‌త్నించినా అది తెరుచుకోలేదు. ఎమర్జెన్సీ బటన్‌ నొక్కినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ముగ్గురిలో ఇద్దరు చిన్నారులు భయంతో ఏడవడం ప్రారంభించారు. మరో చిన్నారి వారికి దైర్యం చెప్పేందుకు ప్రయత్నించింది. లిఫ్ట్‌ డోర్‌ను బలంగా కొడుతూ.. సాయం కోసం గ‌ట్టిగా అరిచింది.

అంతేగాక తన రెండు చేతులతో బలవంతంగా డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించింది. అయినా అది ఓపెన్‌ కాపోవడంతో  భయాందోళనకు గురైంది. ప్రాణ భ‌యంతో ముగ్గురు పిల్లలు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ, ఏడ్చడం వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఆ చిన్నారులు  అందులోనే ఉండిపోయారు. అనంతరం ఎట్టకేలకు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
చదవండి: నకిలీ ఐపీఎస్‌ అధికారి శ్రీనివాస్ ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు

ఈ ఘటనపై చిన్నారుల త‌ల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ లిఫ్ట్‌లో జనాలు తరుచూ చిక్కుకుంటున్నారని, దీనిపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలిపారు. లిఫ్ట్‌ ఆగిపోయిన స‌మ‌యంలో అందులో సీనియ‌ర్ సిటీజ‌న్లు, చిన్నారులు ఉంటే వారి ప్రాణాల‌కే ప్రమాదం ఉంటుంద‌ని వాపోయారు. చిన్న పిల్లలు లిఫ్ట్‌ వాడేందుకే భయపడుతున్నారని తెలిపారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్‌ బిల్డర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సొసైటీలో ఉన్న లిఫ్ట్‌లల్లో త‌ర‌చూ ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయని చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా అపార్ట్‌మెంట్‌ బిల్డర్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులతో బెంచ్.. చరిత్రలో మూడోసారి..

మరిన్ని వార్తలు