షాకింగ్‌ వీడియో: రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణికుల పరుగులు..

17 Apr, 2021 19:11 IST|Sakshi

భారత్‌లో రైల్వే వ్యవస్థకు ఘనమైన చరిత్ర ఉంది. అత్యధిక మంది రైళ్లో ప్రయాణించేందుకే ఆసక్తి చూపుతారు. ఇక ప్లాట్‌ఫామ్‌పై ప్యాసింజర్‌ రైలు ఆగిన సమయంలో వందలాది మంది స్టేషన్‌ బయటకు గుంపులు గుంపులుగా రావడాన్ని చూసే ఉంటాం. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సాధారణ పరిస్థితులు లేకపోవడంతో రైల్వే స్టేషన్లలోనూ ఎక్కువ మంది కనిపించడం లేదు. స్టేషన్‌లోకి అడుగుపెట్టాలంటే ముందుగానే ట్రైన్‌ రిజర్వేషన్‌ చేసుకోవాలన్న నిబంధన ఉండటంతో తక్కువ మంది మాత్రమే రైలులో ప్రయాణిస్తున్నారు.  

తాజాగా రైల్వే స్టేషన్‌ నుంచి ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయటకు పరుగులందుకున్నారు. వీరిలో కొందరు లగేజ్ పట్టుకొని ఉండగా.. మరికొంతమంది తమ చిన్నారులతో పరుగులు తీశారు. ఈ సంఘటన చూస్తుంటే అక్కడేదో ప్రమాదం జరిగినట్లు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. దీంతో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. అయితే బయటి వారంతా రైల్వే స్టేషన్‌లో ఏం జరిగిందోనని ఆశ్యర్యంగా చూస్తున్నారు. అసలేం జరిగిందని ఆరా తీస్తే.. అసలు విషయం తెలిసి అందరూ అవ్వాకయ్యారు. 

చదవండి: కరోనా ఎఫెక్ట్: భారత రైల్వే కీలక నిర్ణయం

కరోనా పరీక్షల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు రైల్వే స్టేషన్‌ నుంచి వేగంగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన బిహార్‌లోని బక్సర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. స్టేషన్‌లోని ఆరోగ్య సిబ్బంది తమకు ఎక్కడా కరోనా టెస్టులు చేస్తారేమో అన్న భయంతో రైలు దిగగానే వలస కార్మికులు ఉరుకులు పరుగుల మీద స్టేషన్‌ బయటకు వెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ కోవిడ్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. బీహార్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళుతుంటారుజలు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపధ్యంలో బీహార్ నుంచి వలస వెళ్ళినవారూ తిరిగి రావడం ప్రారంభించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అందులో భాగంగానే రైళ్ళలో తిరిగి వస్తున్న ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు