అవమానించారు.. డబ్బులడిగారు: మను భాకర్‌

20 Feb, 2021 13:46 IST|Sakshi

ఎయిర్‌ ఇండియా సిబ్బందిపై మండిపడ్డ మను భాకర్‌

కిరణ్‌ రిజుజు జోక్యంతో సద్దుమణిగిన వివాదం

షూటర్‌కి మద్దతుగా నిలిచిన నెటిజనులు.. దిగి వచ్చిన ఎయిర్‌ ఇండియా

న్యూఢిల్లీ: ఒలంపియన్‌, షూటర్‌ మను భాకర్‌కు ఢిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదరయ్యింది. ఆయుధాలు తీసుకెళ్లడానికి వీలు లేదంటూ ఎయిర్‌ ఇండియా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అంతేకాక డబ్బులు కూడా డిమాండ్‌ చేశారు. చివరకు మంత్రి కిరెణ్‌ రిజుజు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ మేరకు మను భాకర్‌ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

‘‘షూటింగ్‌ ట్రైనింగ్‌ నిమిత్తం నేను మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని షూటింగ్‌ అకాడమీకి వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని నాతో పాటు తీసుకెళ్లడం తప్పని సరి. ఈ క్రమంలో నేను ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాను. ఏఐ 437 విమానంలో నేను ప్రయాణించాల్సి ఉంది. కానీ ఎయిర్‌పోర్టు సిబ్బంది నన్ను విమానం ఎక్కడానికి అనుమతించలేదు. అన్ని పత్రాలు చూపించినప్పటికి వారు నన్ను డబ్బులు అడిగారు. డీజీసీఏ అనుమతి ఇచ్చినప్పటికి వారు 10,200 చెల్లించాలని తెలిపారు’’ అన్నారు

‘‘వారిలో ముఖ్యంగా ఎయిర్‌ ఇండియా ఇన్‌ చార్జ్‌ మనోజ్‌ గుప్తా, మిగతా సిబ్బంది నన్ను దారుణంగా అవమానించారు. నన్ను క్రిమినల్‌ కన్నా దారుణంగా చూశారు. కాస్త మర్యాదగా ప్రవర్తించమని నేను వారిని కోరాను. ప్రతిసారి ఇలా ఆటగాళ్లను అవమానించకండి.. వారి దగ్గర డబ్బులు అడగకండి’’ అంటూ ట్వీట్‌ చేశారు మను భాకర్‌. దాంతో పాటు కేంద్ర మంత్రి కిరెణ్‌ రిజుజు, హర్దీప్‌ సింగ్‌ పూరిని ట్యాగ్‌ చేశారు. 

ఈ ట్వీట్‌పై కిరెణ్‌ రిజుజు స్పందించారు. ఎయిర్‌ ఇండియా సిబ్బందితో మాట్లాడి వివాదానికి ముగింపు పలికారు. అనంతరం కిరెణ్‌ రిజుజుకు కృతజ్ఞతలు తెలిపారు మను భాకర్‌. ప్రస్తుతం ఈ వివాదంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘‘దేశాన్ని దోచుకుని.. దొంగ పత్రాలతో ఇక్కడి నుంచి పారిపోయే వారికి మర్యాద ఇస్తారు.. అంతర్జాతీయ వేదిక మీద దేశ ఖ్యాతిని ఇనుమడింపచేసేవారి విషయంలో ఇలా ప్రవర్తించడం దారుణం’’ అంటూ విమర్శిస్తున్నారు నెటిజనులు.

దీనిపై ఎయిర్‌ ఇండియా సిబ్బంది స్పందించింది. డబ్బులు అడిగిన మాట వాస్తవమే కానీ అది లంచం కాదని .. ఆయుధాలను తీసుకెళ్లేందుకు చెల్లించాల్సిన చార్జీలుగా పేర్కొన్నది. అంతేకాక ఎయిరిండియా క్రీడాకారులను ఎన్నటికి అవమానించదని.. వారిని ప్రోత్సాహిస్తుందని.. గౌరవిస్తుందని తెలిపింది.  

చదవండి:
‘ఎవరికీ క్రీడలంటే పరిజ్ఞానం లేదు’ 
'టాటా' యుద్ద విమానాలు వచ్చేస్తున్నాయి!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు