జీతం అడగటమే నేరమా? ఇనుప రాడ్‌తో దాడి చేసిన యజమాని

9 Nov, 2022 11:32 IST|Sakshi

అగర్తలా: తనకు రావాల్సిన జీతం డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఓ వ్యక్తిపై యజమాని విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్టోబర్‌ నెలకు సంబంధించిన పెండింగ్‌ సాలరీ ఇవ్వమన్నందుకు ఇనుప రాడ్డు, బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటన త్రిపుర రాజధాని అగర్తలా నగరంలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సూరజిత్‌ త్రిపుర అనే వ్యక్తి మఫ్టీ అనే బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ఆ దుకాణం యజమాని సాహా.. గత అక్టోబర్‌కు సంబంధించి సూరజిత్‌కు జీతం ఇవ్వలేదు. ఈ క్రమంలో తనకు పెండింగ్‌ సాలరీ ఇవ్వాలని సూరజిత్‌ డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన సాహా.. అక్కడే పని చేసే మరో వ్యక్తి సాయంతో సూరజిత్‌పై ఇనుప రాడ్‌, బెల్టుతో దాడి చేశాడు. చెంపదెబ్బలు కొట్టాడు. బాధితుడు సూరజిత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు పశ్చిమ అగర్తలా పోలీసులు. ఈ వీడియోను ట్రైబల్‌ పార్టీ టిప్రా మోతా చీఫ్‌ ప్రద్యోత్‌ మానిక్యా ట్విటర్‌లో షేర్‌ చేశారు. దుకాణం యజమాని తీరుపై మండిపడ్డారు. యజమానికిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఇదీ చదవండి: రోడ్డుపై నిలిచిపోయిన బస్సు.. కారు దిగొచ్చి వెనక్కి నెట్టిన కేంద్ర మంత్రి

మరిన్ని వార్తలు