కరోనా కల్లోలం: మా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పెట్టబోం

26 Apr, 2021 18:26 IST|Sakshi

కేరళ: మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణతో ఇప్పటివరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించిన రాష్ట్రాలు ప్రస్తుతం లాక్‌డౌన్‌ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా కట్టడికి విధిలేక లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా తాజాగా కర్నాటక కూడా ప్రకటించింది. ఇక కేరళ కూడా ఆ దిశన అడుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు లాక్‌డౌన్‌ విధించేందుకు అంగీకరించలేదు. ‘లాక్‌డౌన్‌ కాకుండా కఠిన ఆంక్షలు విధించడం’ అంటూ అన్ని పార్టీలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి.

కేరళలో కరోనా కట్టడి చర్యలు, వైద్య సేవలు తదితర వాటిపై చర్చించేందుకు సోమవారం ముఖ్యమంత్రి పినరయి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలు లాక్‌డౌన్‌ వైపు మొగ్గు చూపలేదు. కరోనా కట్టడి చర్యలపై ఆయా పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెప్పాయి. అనంతరం ముఖ్యమంత్రి పినరయి అఖిలపక్ష సమావేశం వివరాలు వెల్లడించారు. అఖిలపక్షం లాక్‌డౌన్‌ పెట్టవద్దనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సీఎం ప్రకటించారు. రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా ఉంటుందని తెలిపారు. వారాంతంలో మినీ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు. 

చదవండి: మాస్క్‌ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌

చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు

మరిన్ని వార్తలు