Shraddha murder case: నార్కో పరీక్షలకు కోర్టు అనుమతి

18 Nov, 2022 05:27 IST|Sakshi

ఢిల్లీ హత్య కేసులో అఫ్తాబ్‌ కస్టడీ

ఐదు రోజులు పొడిగింపు  

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాకు నార్కో పరీక్షలు నిర్వహించడానికి గురువారం ఢిల్లీ కోర్టు అనుమతిచ్చింది. ఇందుకోసం మరో అయిదు రోజులు పోలీసు కస్టడీని పొడిగించింది. మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ శుక్లా  నార్కో పరీక్షలకు నిర్వహించడానికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అఫ్తాబ్‌ విచారణ జరిగినప్పుడు కోర్టు వెలుపల భారీ సంఖ్యలో నిరసనకారులు చేరుకొని వెంటనే అతనిని ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అఫ్తాబ్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి తెచ్చినందుకు తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్‌ను గొంతు నులిపి హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసి, ఫ్రిజ్‌లో ఉంచి  కొన్ని రోజుల పాటు దాచి తర్వాత అఫ్తాబ్‌ ఆ ముక్కలను పారేయడం తెలిసిందే. హత్యాయుధం దొరక్కపోవడంతో పోలీసులు నార్కో పరీక్షలకు అనుమతి కోరారు.

ముఖాన్ని కాల్చేసి..
పోలీసుల విచారణలో అఫ్తాబ్‌ అమీన్‌ ఒళ్లు జలదరించే విషయాలు బయటపెడుతున్నాడు. సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి ఎన్నో హేయమైన చర్యలకు దిగాడు. ఆమె  ముఖం ఎవరూ గుర్తు పట్టకుండా కాల్చినట్టుగా పోలీసుల ఎదుట అంగీకరించాడు. కట్టెలా బిగుసుకుపోయిన మృతదేహం కొయ్యడానికి వీలుగా వేడినీళ్లలో బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి వేశానని, అప్పుడే శవాన్ని కొయ్యగలిగానని పోలీసులు దగ్గర చెప్పినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో నెలకి 20వేల లీటర్ల వరకు నీళ్లు ఉచితమైనా అతని ఫ్లాట్‌కి నీటి బిల్లు రూ.300 పైగా రావడానికి కారణాలను కనుగొన్నారు.   మృతదేహాన్ని కోస్తున్నప్పుడు చప్పుడు బయటకు వినిపించకుండా నీళ్ల పైపులు తిప్పి ఉంచాడని, ఇంట్లో మరకలు కనిపించకుండా తరచూ ఫ్లాట్‌ని  కడిగేవాడని పోలీసులు విచారణలో తేలింది. వారిద్దరి మధ్య తరచూ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గొడవలు అవుతూ ఉండేవని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు