శ్రద్ధా వాకర్‌ హత్యోదంతం.. లవ్‌ జిహాద్‌ ఘటన కాదు! కానీ..

24 Nov, 2022 18:27 IST|Sakshi

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్యోదంతంపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ గురువారం స్పందించారు. ఈ కేసుకు మతం రంగు పులమడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఇది లవ్‌ జిహాద్‌ ఘటన కాదంటూ ఉద్ఘాటించారు. 

‘‘ఈ వ్యవహారాన్ని మత కోణంలో బీజేపీ చూస్తోంది. బీజేపీ రాజకీయాలు పూర్తిగా తప్పు. ఇది లవ్ జిహాద్ ఘటన కాదు. కానీ.. ఒక మహిళపై హేయనీయంగా ప్రవర్తించడం, వేధించడం.. దాడికి సంబంధించింది. ఆ కోణంలోనే ఈ కేసును చూడాలి.. అంతా ఖండించాలి కూడా’’ అని ఒవైసీ పేర్కొన్నారు. ఇక ఆజామ్‌ఘడ్‌లో ఓ వ్యక్తి తన భార్యను కిరాకతంగా చంపి.. సూట్‌కేసులో కుక్కిన ఘటనపైనా స్పందించారు ఒవైసీ. ఇలాంటి ఘటనలు బాధాకరమని, వీటికి హిందూ-ముస్లిం రంగులు పులిమి రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.

శ్రద్ధా వాకర్ హత్య కేసును ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఆదివారం ఈశాన్య ఢిల్లీలో జరిగిన రోడ్ షోలో అసోంముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. మెహ్రౌలీ(శ్రద్ధా కేసు) ఘోర హత్య తనను కలిచివేసిందని అన్నారు. దేశానికి యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌తో పాటు లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టం తేవాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ దేశానికి అఫ్తాబ్‌(శ్రద్ధా హత్యకేసు నిందితుడు) లాంటి వాళ్ల అవసరం లేదని, శ్రీరాముడులాంటి వ్యక్తి.. నరేంద్ర మోదీ నేతల అవసరం ఉందని అసోం సీఎం వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు