శ్రద్ధావాకర్‌ హత్యకేసులో దిమ్మ తిరిగే ట్విస్టులు.. అలా జరిగి ఉండకపోతే ‘మిస్సింగ్‌’ మిస్టరీగానే మిగిలేదేమో!

17 Nov, 2022 13:57 IST|Sakshi

క్రైమ్‌: ఢిల్లీ మెహ్రౌలీ సంచలన కేసులో దర్యాప్తు లోతుగా వెళ్లే కొద్దీ.. పోలీసులకు షాకింగ్‌ విషయాలే తెలుస్తున్నాయి. పోలీసులు సైతం నివ్వెరపోయేలా ఉంటున్నాయి ఈ కేసు పరిణామాలు. ఇప్పటికీ ఆమె సెల్‌ఫోన్‌, కొన్ని శరీర భాగాలు ఇంకా దొరకలేదు. శ్రద్ధ ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టవద్దనే ఉద్దేశంతో కాల్చేసినట్లు తాజాగా వెల్లడించాడు నిందితుడు అఫ్తాబ్‌. అలా.. నిలువెల్లా క్రూరత్వమే కనిపిస్తోంది ఈ వ్యవహారంలో. మరోవైపు.. 

శ్రద్ధా వాకర్‌ హత్యోదంతంలో పోలీసులు, నిందితుడిని ఇవాళ(గురువారం) కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్‌ ఉంది. ఈ తరుణంలో.. అఫ్తాబ్‌ పూనావాలా నేరంగీకారంపై బాధితురాలి తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. కూతురు మరణించిందనే వార్తను వికాస్‌ వాకర్‌ ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. ఫోరెన్సిక్‌ పరీక్షల్లో ఫలితం తేలే వరకు ఆమె చనిపోయిందని తాను నమ్మబోనని వికాస్‌ కన్నీటి పర్యంతం అయ్యాడు. అతను(అఫ్తాబ్‌) నా ఎదుటే నేరం అంగీకరించాడు. పోలీసుల ఎదుట.. శ్రద్ధ ఇక లేదు అనే మాట చెప్పాడు.  ఆ సమాధానంతో కుప్పకూలిపోయా. నేనింకా ఏం వినదల్చుకోలేదు. నాకు ఆ ధైర్యం కూడా రాలేదు. అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు’’ అని ఓ ఇంటర్వ్యూలో వికాస్‌ వాకర్‌ వెల్లడించారు. 

అఫ్తాబ్‌ను గతంలో చాలాసార్లు కలిశాను. ఆ సమయంలో మాట్లాడినప్పుడు అతను మామూలుగానే అనిపించాడు. కానీ, శ్రద్ధ కనిపించకుండా పోయినప్పటి నుంచి అనుమానం మొదలైంది. ‘‘శ్రద్ధ కనిపించకుండా పోయిందని ఆమె స్నేహితురాళ్ల ద్వారానే నాకు తెలిసింది. రెండున్నర నెలలు ఆమె కోసం వెతికాం. ఆచూకీ దొరకలేదు. అఫ్తాబ్‌ జాడ తెలిశాక.. ఎందుకు విషయం చెప్పలేదని అతన్ని నిలదీశాను. ‘మేమిప్పుడు కలిసి లేనప్పుడు మీకెందుకు చెప్పాలి?’ అని నామీదే కసురుకున్నాడు.

రెండున్నరేళ్లుగా ప్రేమించాడు.  ఎంత ప్రేమిస్తే నా కూతురు మా మాట కాదని బయటకు వచ్చేస్తుంది. కలిసి ఉన్నప్పుడు.. ఆమె బాధ్యత అతనిది కాదా?.  అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని పోలీసుల వద్ద ప్రస్తావించా. పోలీసులు కూడా అతని సమాధానాలు పొంతన లేకపోవడంతో.. గట్టిగా విచారించారు. లేకుంటే.. ఈ కేసులో కదలికలు వచ్చేవి కావేమో. శ్రద్ధ-అఫ్తాబ్‌ల ప్రేమ వ్యవహారం 2021 మధ్య దాకా మాకు తెలియదు. కానీ, అంతకు ముందు నుంచే ఓ స్నేహితుడిగా అతను నాకు తెలుసు. వాళ్ల ప్రేమ గురించి తెలియగానే వాడు నాకు నచ్చలేదని ఆనాడే శ్రద్ధతో చెప్పా. అతన్ని పెళ్లి చేసుకోవద్దని సూచించా. మన వర్గానికే చెందిన వ్యక్తిని చేసుకోవాలని శ్రద్ధను కోరా. కానీ, నా కూతురు మాట వినలేదు. సొంత నిర్ణయం తీసుకుంది. ఫలితం.. కన్నవాళ్లకు లేకుండా పోయింది. వాడికి(అఫ్తాబ్‌)కు ఉరే సరి అని కన్నీళ్లతో వికాస్‌ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: ఢిల్లీ శ్రద్ధా వాకర్‌ హత్యోదంతం.. అసలేం జరిగింది?

మరిన్ని వార్తలు