శ్రద్ధా హత్య కేసు: కీలక ఆధారంగా ఆమె వాయిస్‌ రికార్డు..

20 Mar, 2023 19:56 IST|Sakshi

యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్‌ పూనావాలా నేరం చేశాడనేందుకు కీలక సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకి సమర్పించారు. వాటిలో కోర్టులో ప్లే చేసిన శ్రద్ధా వాయిస్‌ రికార్డు క్లిప్‌ ఈ కేసుకి కీలకంగా మారింది. ఈ మేరకు ఈ కేసుకి సంబంధించిన వాదనలు సోమవారం సాకేత్‌ కోర్టులో జరిగాయి. పోలీసులు నిందితుడు అఫ్తాబ్‌ పూనావాలాని కోర్టులో హజరుపరిచారు. ఈ కేసు విచారణకు శ్రద్ధ తడ్రి కూడా హజరయ్యారు. కోర్టులో ఢిల్లీ పోలీసులు అతడు నేరం చేశాడని రుజువు చేసేందుకు విశ్వసనీయమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు.

అందుకు సంబంధించిన ఆధారాలను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు అమిత్ ప్రసాద్‌, మధుకర్‌ పాండేలు కోర్టుకి సమర్పించారు. ఈ కేసుకి సంబంధించి నేరం చేయడానికి దారితీసిన ఆరు పరిస్థితులు, ముగ్గురు ప్రత్యక్ష సాక్ష్యలను గురించి కోర్టుకి వివరించారు. అలాగే ఆమె హత్యకు ముందు చివరిసారిగా చూసిన వారి గురించి కూడా కోర్టుకి తెలిపారు. ఈ నేరం సహజీవనం కారణంగా జరిగిందని, అతడితో రిలేషన్‌ షిప్‌లో ఉన్నంత కాలం ఆమె హింసకు గురైందని చెప్పారు. అలాగే శ్రద్ధా నవంబర్‌ 23, 2022న ముంబైలోని వసాయి పోలీస్టేషన్‌కి చేసిన ఫిర్యాదు కూడా ఈ హత్య కేసుకి బలమైన ఆధారమని చెప్పారు .

అలాగే శ్రద్ధా ప్రాక్టో యాప్‌ ద్వారా వైద్యుల నుంచి కౌన్సిలింగ్‌ తీసుకుంటున్న విషయం గురించి పేర్కొన్నారు. ఆ ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌లో వైద్యులకు అఫ్తాబ్‌ తనను వెంటాడి వెతికి మరీ చంపేస్తాడని చెబుతున్న ఆడియో క్లిప్‌ను సైతం కోర్టులో ప్లే చేశారు. ఆ క్లిప్‌లో ఒక రోజు అఫ్తాబ్‌ తన గొంతు పట్లుకున్నట్లు వైద్యులకు చెబుతున్నట్లు వినిపిపిస్తుంది. శ్రద్ధాకు సంబంధించిన మూడు డిజిల్‌ మొబైల్‌ ఫోన్‌లను కూడా కోర్టుకి సమర్పించారు. అలాగే శ్రద్ధా బ్యాంకు లావాదేవీలను నిర్వహించి ఫ్రిజ్‌, రంపం, నీళ్లు, క్లినర్‌, అగరబత్తులను కొన్న ఆధారాలను సైతం కోర్టులో ప్రొడ్యూస్‌ చేశారు.

పైగా అఫ్తాబ్‌ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆమె బతికే ఉందన్నట్లు ఆమె సోషల్‌ మీడియా ఖాతాను నిర్వహించాడని ఢిల్లీ పోలీసుల తరుఫు న్యాయవాదులు కోర్టుకి విన్నవించారు. అతను హత్య చేశాడనేందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయి కావున భారత శిక్షాస్మృతి ప్రకారం 302/201 సెక్షన్ల కింది నిందితుడిని తగిన విధంగా శిక్షించాలని న్యాయవాదులు కోర్టుని కోరారు. అదనపు సెషన్స్‌ జడ్జి మనీషా ఖురానా కకర్‌ డిల్లీ పోలీసుల తరుఫు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత వాటిపై ప్రతిస్పందించడానికి లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌(ఎల్‌ఏసీ) జావేద్‌ హుస్సేన్‌కి కొంత సమయం ఇచ్చారు. ఈ మేరకు జడ్డి ఈ కేసుకి సంబంధించి తదుపరి వాదనల కోసం మార్చి 25కి వాయిదా వేసింది. 

(చదవండి: ఇందిరా గాంధీ టైంలోనే హక్కులను హరించబడ్డాయ్‌!: కేంద్ర మంత్రి)

మరిన్ని వార్తలు