'లివ్‌-ఇన్ రిలేషన్, పెళ్లి కాదు.. మగాళ్ల మనస్తత్వంలోనే అసలు సమస్య..'

18 Nov, 2022 17:35 IST|Sakshi

శ్రద్ధ వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఆమెను 35 ముక్కలు చేసిన అత్యంత క్రూరమైన ఈ అనాగరిక చర్య సర్వత్రా చర్చనీయాంశమైంది. లివ్-ఇన్  రిలేషన్ల కారణంగానే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కౌశల్ కిశోర్‌ గురువారం అన్నారు. చదువుకున్న అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, లివ్ ఇన్ రిలేషన్ల జోలికి వెళ్లకుండా నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సూచించారు.

అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలకు వివాదాస్పద రచయిత్రి తస్లీమా నజ్రీన్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్‌లో ఈ విషయంపై స్పందిస్తూ ఓ సందేశం రాసుకొచ్చారు. 'లివ్‌ ఇన్ రిలేషన్‌లో ఉన్న ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేస్తే.. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి.. లివ్ ఇన్ రిలేషన్ల వల్లే నేరాలు జరుగుతున్నాయని మీరు చెబుతున్నారు. కానీ పెళ్లైన పురుషులు తమ భార్యలను చంపినప్పుడు.. పెళ్లిళ్ల వల్లే నేరాలు జరుగుతున్నాయి, అందుకే పెళ్లి చేసుకోవద్దు.. లివ్‌ ఇన్ రిలేషన్లే ఎంచుకోండి అని ఎందుకు చెప్పడం లేదు. పెళ్లిళ్లు, లివ్‌ ఇన్ రిలేషన్లు కాదు.. అసలు సమస్య మగాళ్ల మనస్తత్వంలోనే ఉంది.' అని నజ్రీన్ రాసుకొచ్చారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు.

మరోవైపు కౌషల్ కిశోర్ వ్యాఖ్యలపై శివసేన నేత ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కౌషల్ కిశోర్‌ను పదవి నుంచి తప్పించాలని కోరారు. ఇలాంటి హేయమైన నేరాళ్లో మహిళలనే నిందించడం క్రూరం, నిర్దాక్షిణ్యంగా అభివర్ణించారు.
చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా

మరిన్ని వార్తలు