బెయిల్‌పై విడుదల: రాజకీయ నాయకుడికి అట్టహాసంగా ఘనస్వాగతం

21 Oct, 2022 10:45 IST|Sakshi

నోయిడా: రాజకీయ నేత శ్రీకాంత్‌ త్యాగి మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించి జైలు పాలైన సంగతి తెలిసిందే. ఐతే ఆ నాయకుడు ప్రస్తుతం బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో అతని అనుచర వర్గాలు అతనికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. పైగా శ్రీకాంత్‌ బాయ్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సదరు రాజకీయ నాయకుడు త్యాగి తన ప్రత్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ...తనపై చేసిన గ్యాంగ్‌స్టర్‌ వంటి ఆరోపణలు కల్పితమన్నారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసే ప్రక్రియలో భాగంగా ఈ క్రుట్రలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వివాదంలోకి తన సోదరిని కూడా లాగి తమ మధ్య గొడవలు సృష్టించాలని చూశారన్నారు.

ఇలాంటి విపత్కర సమయంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచిని తమ కమ్యూనిటీ వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజకీయాల్లోనే ఉంటానని, తాను చేయాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చాడు. తన తదుపరి నిర్ణయాల విషయమై మాట్లాడుతూ...తన మద్దతుదారులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

త్యాగికి అలహాబాద్‌ హైకోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేయడంతో అతను గురువారం జైలు నుంచి విడుదలయ్యాడు. వాస్తవానికి త్యాగి గ్రాండ్‌ ఓమాక్స్‌ సొసైటీలో ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్‌ కావడంతో అతన్ని అరెస్టు చేశారు. అతనిపై దోపిడీ నేరం, గ్యాంగ్‌స్టర్‌, మహిళలపై దాడి చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఐతే త్యాగి మాత్రం బీజేపీ రైతు విభాగం సభ్యుడినని చెబుతూ... పార్టీ అధినేత జేపీ నడ్డాతో దిగిన ఫోటోలను చూపిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం సీరియస్‌గా ఆ వ్యాఖ్యలను ఖండించడం గమనార్హం.

(చదవండి: మూడేళ్లుగా మారువేషంలో.. బౌద్ధ సన్యాసి ముసుగులో భారత్‌లో గూఢచర్యం?)

>
మరిన్ని వార్తలు