Sidhu Moosewala Statue: దేవుడా ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దు.. సిద్ధూ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ తండ్రి భావోద్వేగం

18 Jul, 2022 19:28 IST|Sakshi

చండీగఢ్‌: సిద్ధూ మూసేవాలా తండ్రి కొడుకును తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మే 29న దారుణ సిద్ధూ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ తండ్రి బాల్‌కౌర్ సింగ్‌ ఆవిష్కరించి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. 28 ఏళ్లకే కొడుకును విగ్రహం రూపంలో చూడాల్సి వస్తుందని  అనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించారు.

ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాకు గుర్తుగా ఆయన అభిమానులు 6.5 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. సిద్ధూ అంత్యక్రియలు జరిగిన మాన్సా జిల్లాలోని మూసా గ్రామంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి సిద్ధూ తల్లిదండ్రులు బాల్‌కౌర్ సింగ్‌, చరణ్‌ కౌర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుమారుడ్ని విగ్రహం రూపంలో చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి సిద్ధూ అభిమానులు భారీగా తరలివచ్చారు.

విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బాల్‌కౌర్ సింగ్ మాట్లాడారు. తన కుమారుడ్ని హత్య చేసిన వారు దేశ, విదేశాల్లో ఎక్కడ తలదాచుకున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిద్ధూను చంపామని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తికి ప్రభుత్వం భద్రత కల్పించడమేంటని మండిపడ్డారు.

మే 29న సిద్ధూను ఓ వాహనంలో వెంబడించిన దుండగులు అతనిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగి సరిగ్గా 50 రోజులవుతున్న సమయంలోనే అభిమానులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం గమనార్హం.

చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్‌ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ..

మరిన్ని వార్తలు