ఉచిత విద్యుత్తు..రోజంతా కరెంటు

5 Jul, 2021 04:47 IST|Sakshi

సొంత ప్రభుత్వానికి కాంగ్రెస్‌ నేత సిద్ధూ ఝలక్‌ 

చండీగఢ్‌: పంజాబ్‌లో 300 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా అందివ్వాలని, రోజంతా అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని కాంగ్రెస్‌ నేత నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ డిమాండ్‌ చేశారు. పరిశ్రమలకు కూడా తక్కువ ధరకే కరెంటు సరఫరా చేయాలని ఆదివారం ట్విట్టర్‌లో కోరారు. ‘పంజాబ్‌ ప్రభుత్వం ఇప్పటికే 9వేల కోట్ల సబ్సిడీ ఇస్తోంది. దీంతోపాటు, గృహ, పారిశ్రామిక అవసరాలకు ప్రస్తుతం ఒక్కో యూనిట్‌పై రూ.10–12వరకు విధిస్తున్న సర్‌ఛార్జిని రూ.3–5కు తగ్గించాలి’అని ట్వీట్‌ చేశారు.

ఆప్‌ పంజాబ్‌లో అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా, అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేస్తామంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించిన నేపథ్యంలో సిద్దూ ఈ మేరకు పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా డిమాండ్‌ చేయటం గమనార్హం.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధిష్టానం సూచించిన 18 అంశాలతో కూడిన ప్రజానుకూల ఎజెండాను అమలు చేయాలన్నారు. జాతీయ విధానం ప్రకారం కొత్తగా విద్యుత్‌ కొనుగోలు ధరలను నిర్ణయిస్తూ పంజాబ్‌ శాసనసభ కొత్త చట్టాలను ఆమోదించాలని  సూచించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌తో పలు అంశాలపై విభేదిస్తూ వస్తున్న సిద్ధూ ఈ మేరకు ట్వీట్లు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

మరిన్ని వార్తలు