కొన్ని చోట్ల కరోనా థర్డ్‌ వేవ్‌ సూచనలు కనిపిస్తున్నాయి..

13 Jul, 2021 20:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే కోవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. ప్రతి రోజూ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 3.9 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయని, దీన్ని బట్టి చూస్తే థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందన్న విషయం స్పష్టమవుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి భారత్‌లో థర్డ్‌ వేవ్‌ సూచనలు కనబడడం లేదని, మున్ముందు ఇది మన దేశాన్ని తాకకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

కాగా, ఈ ఏడాది ఆరంభంలో సెకండ్ వేవ్ ప్రారంభమైన తొలినాళ్లలో ప్రపంచ వ్యాప్తంగా రోజు వారీ కేసుల సంఖ్య దాదాపుగా 9 లక్షల వరకు ఉండిందని ఆయన తెలిపారు. థర్డ్ వేవ్ రాకుండా నివారించాలని, కొత్త వేరియంట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ కొన్ని గంటల క్రితమే హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఆంక్షలు ఎత్తివేసినంత మాత్రాన వైరస్ కథ ముగిసిందని భావించరాదని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ..  దేశంలో పలు చోట్ల ప్రజలు మళ్ళీ పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారని, భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా పోటెత్తడం ప్రభుత్వం గమనిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. మరోవైపు వ్యాక్సినేషన్ కొరత నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు