రైతులకు మద్దతుగా ఆత్మహత్య

17 Dec, 2020 04:30 IST|Sakshi

సింఘు సరిహద్దులో తుపాకీతో కాల్చుకున్న మత ప్రబోధకుడు

రైతుల దీన స్థితిని చూసి చలించిపోయానని ఆత్మాహుతి లేఖలో వెల్లడి

న్యూడిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా హరియాణాలోని కర్నాల్‌కు చెందిన మత ప్రబోధకుడు సంత్‌ బాబా రామ్‌ సింగ్‌(65) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలోని సింఘు సరిహద్దు వద్ద తుపాకీతో కాల్చుకున్నారు. రామ్‌సింగ్‌కు పంజాబ్, హరియాణాల్లో అనుయాయులు ఉన్నారు. హరియాణా శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) సహా పలు ఆధ్యాత్మిక సంస్థల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. బాబా రామ్‌సింగ్‌ మృతదేహం సమీపంలో ఆయన పంజాబీలో రాసిన ఆత్మాహుతి లేఖ లభించింది. ‘హక్కుల కోసం రోడ్డుపై ఆందోళన చేస్తున్న రైతుల దీనస్థితిని, వారికి న్యాయం చేయకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేతను చూసి తట్టుకోలేకపోతున్నాను’ అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.

రైతులకు మద్దతుగా పలువురు తమకందిన ప్రభుత్వ పురస్కారాలను వెనక్కు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘రైతులకు మద్దతుగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ సేవకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇది ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా తీసుకుంటున్న చర్య’ అని వివరించారు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామ్‌సింగ్‌ మృతికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యకు మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ రాక్షసత్వం అన్ని హద్దులు దాటిందని మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


కమిటీతో లాభం లేదు
రైతు ఆందోళనలపై సుప్రీంకోర్టు సూచించినట్లుగా కమిటీని ఏర్పాటు చేయడం వల్ల పరిష్కారం లభించదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దే ఏకైక పరిష్కారమని  పేర్కొన్నాయి. కమిటీని ఏర్పాటు చేస్తామని చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిందని, ఆ ప్రతిపాదనను అప్పుడే తిరస్కరించామని రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ సభ నేత అభిమన్యు కోహర్‌ వెల్లడించారు. ఇప్పటివరకు చర్చలు జరిపిన ప్రభుత్వ ప్రతినిధులు, రైతు ప్రతినిధులు కమిటీతో సమానమేనని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, దానిపై ప్రభుత్వ స్పందనను గమనించిన తరువాత ఈ విషయంపై మాట్లాడుతామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ పేర్కొన్నారు.

మరోవైపు, ఇతర రైతు సంఘాలతో సమాంతర చర్చలను నిలిపేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న 40 రైతు సంఘాల ఐక్య కూటమి ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ కేంద్రానికి లేఖ రాసింది. యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలతో ఇటీవల కేంద్ర  ప్రతినిధులు భేటీకావడం తెల్సిందే. వ్యవసాయ చట్టాలకు సవరణలు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు, చిల్లా సరిహద్దు వద్ద భద్రతను మరింత పెంచారు. చిల్లా సరిహద్దును  దిగ్బంధిస్తామని రైతు నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీ–నోయిడా మార్గంలోని చిల్లా సరిహద్దులో  బలగాలను మోహరించారు.  

మరిన్ని వార్తలు