పిల్లల్ని కనండి ఇంక్రిమెంట్‌ పొందండి.. ఉద్యోగులకు వరాలిచ్చిన సిక్కిం సీఎం

17 Jan, 2023 15:59 IST|Sakshi

భారత దేశ జనభా ఇప్పటికే దాదాపు 140 కోట్లు క్రాస్‌ చేసింది. జనాభా నియంత్రణ విషయంలో పలు ప్రభుత్వాలు ఇప్పటికే ఒక్కరు ముద్దు.. ఇద్దరు వద్దు అంటూ ప్రకటనలు చేశాయి. కానీ, ఇందుకు భిన్నంగా ఈశాన్య రాష్ట్రం సిక్కిం సీఎం మాత్రం కొత్త పాలసీకి తెరలేపారు. జనాభాను పెంచాలన్నారు. పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్‌ ఉంటుందని భరోసా ఇచ్చారు. 

వివరాల ప్రకారం.. సిక్కింలో మాఘే సంక్రాంతి సందర్బంగా సీఎం ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమాంగ్‌ మాట్లాడుతూ సిక్కింలో తమ జాతి జనాభాను పెంచాలన్నారు. మూడో పిల్లాడ్ని కంటే డబుల్‌ ఇంక్రిమెంట్‌ ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధంగా చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగినులు ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వారికి ఎక్కువ ప్రోత్సాహకాలు అందుతాయని ఆఫర్‌ ఇచ్చారు. 

అలాగే.. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇన్సెంటీవ్‌, ముగ్గురు పిల్లల్ని కన్నవారికి డబుల్‌ ఇక్రిమెంట్‌తో పాటు ఎక్కువ సెలవులు తీసుకునేందుకు కూడా అనుమతి ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే, సిక్కింలో ఇటీవలి కాలంలో సంతనోత్పత్తి రేటు చాలా తగ్గిపోయిందన్నారు. అందుకే తమ జాతి జనాభాను పెంచాలని సూచించారు ఇదే క్రమంలో ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు అవసరమైన డబ్బును కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

ఐవీఎఫ్‌ ద్వారా పిల్లల్ని కనే ఉద్యోగినులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తమాంగ్‌ వెల్లడించారు. ఐవీఎఫ్‌ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 38 మంది మహిళలు గర్భం దాల్చారని, కొందరు తల్లులు కూడా అయ్యారని తెలిపారు. కాగా, సర్వీసులో ఉన్న మహిళలకు 365 రోజుల ప్రసూతీ సెలవులు ఇస్తున్నారు. మగ ఉద్యోగులకు 30 రోజుల పితృత్వ సెలవులు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాగా, సీఎం హామీలపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు