అయోధ్య భూమి పూజ కోసం వెండి తమలపాకులు

3 Aug, 2020 21:02 IST|Sakshi

లక్నో: హిందూ మతంలో తమలపాకులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇళ్లు, ఆలయాలు ఇలా ఎక్కడ ఏ పూజ చేసినా తమలపాకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ నెల ఐదున అయోధ్యలో జరిగే రామ మందిర భూమి పూజకు కాశీ నుంచి వెండి తమలపాకులు తరలి వెళ్లాయి. నాడు నిర్వహించే భూమి పూజ కార్యక్రమంలో ఈ వెండి తమలపాకులను వినియోగించనున్నారు. వారణాసిలోని కాశీ చౌరాసియా సంఘానికి చెందిన వారు వెండితో ప్రత్యేకంగా ఐదు తమలపాకులను తయారు చేయించారు. ఆ సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్‌ చౌరాసియా వీటిని వేద పండితులకు అందజేయగా.. వారు వీటిని తీసుకుని నేడు అయోధ్యకు బయలుదేరారు. (‘నాకు తొలి ఆహ్వానం అందడం రాముని కోరిక’)

అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తిగా రాతితోనే జరగునున్న సంగతి తెలిసిందే. నిర్మాణంలో ఇనుము, ఉక్కు వినియోగించడం లేదని.. మందిర నిర్మాణ పర్యవేక్షకుడు అను భాయ్‌ సోంపురా తెలిపారు. తాను గత 30 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నాను అన్నారు. మందిర నిర్మాణానికి ఇక్కడ లభించే రాళ్లతో పాటు.. రాజస్తాన్‌ నుంచి కూడా తెప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేవలం 180 మంది మాత్రమే హాజరవుతున్నారు. 

మరిన్ని వార్తలు