సీపీఆర్‌ చేస్తే బతికేవారేమో

3 Jun, 2022 04:53 IST|Sakshi

కేకే అకాల మృతిపై డాక్టర్లు

కోల్‌కతా/ముంబై: గుండెపోటుతో మరణించిన ప్రఖ్యాత బాలీవుడ్‌ గాయకుడు కృష్ణకుమార్‌ కున్నత్‌ (కేకే)కు సకాలంలో సీపీఆర్‌ చేసుంటే ప్రాణాలు నిలిచేవని కోల్‌కతా వైద్యులు అభిప్రాయపడ్డారు. ‘‘ఆయన గుండెలో ఎడమవైపు ధమనిలో 80 శాతం బ్లాకేజీ ఉంది. మిగతా ధమనులు, రక్తనాళాల్లోనూ చిన్నచిన్న బ్లాక్‌లున్నాయి. చాలా రోజులుగా ఈ సమస్య ఉన్నట్టుంది. దీనికి తోడు లైవ్‌ షోలో ఉద్విగ్నంగా గడపటంతో గుండెకు రక్తం సరిగా అందక మరణానికి దారితీసింది.

స్పృహ కోల్పోగానే సీపీఆర్‌ చేసుంటే బతికేవారు’’ అని ఒక వైద్యుడు పీటీఐకి చెప్పారు. కేకే యాంటాసిడ్‌ ట్యాబ్లెట్లు ఎక్కువగా తీసుకున్నట్టు పోస్టుమార్టంలో తేలింది. గుండెనొప్పిని అజీర్తిగా భావించి వాటిని వాడి ఉంటారని వైద్యులు చెప్పారు. కోల్‌కతా నుంచి భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ ఛాతిలో నొప్పిగా ఉందని, చేతులూ భుజాలూ లాగుతున్నాయని చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. అభిమానుల కన్నీటి నడుమ కేకే అంత్యక్రియలు ముంబై వెర్సొవా హిందు శ్మశానవాటికలో గురువారం జరిగాయి. కుమారుడు నకుల్‌ అంతిమ సంస్కారం నిర్వహించారు. శ్రేయఘోషల్, అల్కాయాజ్ఞిక్, హరిహరన్, సలీమ్‌ మర్చంట్‌ వంటి సింగర్లు నివాళులర్పించారు.  

మరిన్ని వార్తలు