ఒకే టికెట్‌తో సిటీ బస్‌, మెట్రో, రైలులో ప్రయాణం.. వచ్చే ఏడాదే అందుబాటులోకి!

30 Mar, 2023 18:41 IST|Sakshi

సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నై రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇక్కడికి రోజూ లక్షలాది మంది వచ్చివెళ్తుంటారు. ఇక 2026లో చెన్నై సరిహద్దులు పూర్తిగా మారిపోనున్నాయి. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలు, రాణిపేట జిల్లా పరిధిలోని అరక్కోణం వరకు 1,225 గ్రామాలు, ప్రాంతాలు చెన్నై మెట్రో డెవలప్‌ మెంట్‌ అథారిటీ పరిధిలోకి రానున్నాయి.

ఇది వరకు నగరం, సబర్బన్‌ ప్రాంతాలు 1,189 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండగా.. సరిహద్దు మార్పుతో అది ఏకంగా 5,904 చదరపు కిలోటమీటర్లకు చేరనుంది. కొత్తగా చెన్నై నగర సరిహద్దు చెంగల్పట్టు జిల్లా అచ్చరపాక్కం వరకు, రాణి పేట జిల్లా అరక్కోణం వరకు ఉండనుంది. ఈ విస్తరణ నేపథ్యంలో చెన్నై మహా మహా నగరంలో రవాణా వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా ఒకే గూటి కిందికి తెచ్చేందుకు డీఎంకే ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది.  

సీఎండీఏ చుట్టూ రవాణా.. 
ప్రధాన రవాణా వ్యవస్థలుగా చెంగల్పట్టు నుంచి బీచ్‌ వరకు, సెంట్రల్‌ నుంచి అరర్కోణం , గుమ్మిండి పూండి వైపుగా ఎలక్ట్రిక్‌ రైలు సేవలు, బీచ్‌ నుంచి వేళచ్చేరి వరకు ఎంఆర్‌టీఎస్‌ రైలు సేవలు చెన్నైలో ఇప్పటికే ఉన్నాయి. ఇటీవల విమానాశ్రయం నుంచి కోయంబేడు – సెంట్రల్‌ మీదుగా విమ్కో నగర్‌కు ఓ మార్గం, సెయింట్‌ థామస్‌ మౌంట్‌ నుంచి ఆలందూరు మీదుగా అన్నా సాలై వైపుగా సెంట్రల్‌కు మారో మార్గంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి.

అదే సమయంలో ఎంఆర్‌టీఎస్‌ సేవలు మరికొన్ని నెలల్లో వేళచ్చేరి నుంచి సెయింట్‌  థామస్‌ మౌంట్‌ వరకు విస్తరించనున్నాయి. అలాగే మెట్రో సేవలు చెన్నై నగర శివారుల్లో ఓ వైపు కీలాంబాక్కం వరకు, మరోవైపు సిరుచ్చేరి వరకు, ఇంకో వైపు మాధవరం వరకు విస్తరించనున్నాయి. ఈ నగరానికి నలుదిశల్లో మెట్రో ప్రయాణమే కాకుండా అన్ని రకాల రవాణా వ్యవస్థను సులభతరం చేయనున్నారు. ఇందుకోసం కంబైన్డ్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ రంగంలోకి దిగింది. మల్టీ మోడల్‌ ట్రాన్స్‌ పోర్ట్‌లను ఏకీకృతం చేయడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేసింది. 

2024లో అందుబాటులోకి.. 
ఒకే గూటి కిందికి అన్ని రకాల రవాణా సేవలను తీసుకొచ్చేందుకు  కంబైన్డ్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ వేగవంతం చేసింది. ఒకే టికెట్టుతో పైన అన్ని రకాల రవాణా సేవలను ప్రజలు పొందేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆయా మార్గాలను ఏకం చేయడం, రైల్వేతో అనుసంధానించడం, బస్టాండ్‌ల ఏర్పాట్లు, ప్రయాణికులకు రవాణా మార్గాలను సులభతరం చేయడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూట్‌ మ్యాప్‌ రెడీ చేస్తున్నారు.

ఇందుకోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. తద్వారా ప్రయాణ టికెట్‌ పొందేందుకు వీలుగా రూట్‌ మ్యాప్‌తో పాటు అన్ని రకాల రవాణా సమాచారం, సమయం తదితర  వివరాలను ప్రత్యేకంగా ప్రయాణికులకు తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యాప్‌లో ప్రయాణంలో బయలుదేరే ప్రాంతం, సమయం, చేరవలసిన ప్రాంతం గురించి వివరాలను, మధ్యలో ఉన్న అన్ని రకాల రవాణాలకు సంబంధించిన స్టేషన్లు, స్టాపింగ్‌ల సమాచారం ఉంటుంది.

చేరవలసిన రూట్‌ మ్యాప్‌ ఆధారంగా వివరాలను నమోదు చేసిన పక్షంలో చార్జీ మొత్తం వివరాలు యాప్‌ ద్వారా తెలుసుకుని ఆన్‌లైన్‌ నగదు బదిలీకి అవకాశం కల్పిస్తున్నారు. ఒకే టికెట్టు ద్వారా అన్ని రకాల రవాణా సేవలను 2024 జనవరిలో అమల్లోకి తెచ్చే విధంగా ఆ అథారిటీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.   

మరిన్ని వార్తలు