సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం.. ఎప్పటినుంచంటే..

20 Oct, 2021 10:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జూలై 1 నుంచి వివిధ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు, ఉత్పత్తులపై నిషేధం అమల్లోకి రానుంది. గతంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్‌ కవర్లు, బ్యాగ్‌ల వంటి వాటిపైనే నిషేధం ఉండగా..ఇప్పుడు దీని పరిధిలోకి వచ్చే వస్తువుల జాబితాపై స్పష్టత వచ్చింది. ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నోటిఫికేషన్‌ రూపంలో దీనిపై ఆదేశాలు జారీచేసింది.

నిషేధం అమల్లోకి వచ్చేలోగా.. ప్రజల్లో అవగాహన కల్పనకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) చర్యలు ప్రారంభించింది. అలాగే ప్రత్యామ్నాయ వస్తువుల వాడకంపై ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. 

నిషేధం వీటిపైనే.. 
 ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, ఉత్పత్తి, దిగుమతి, స్టాక్‌ పెట్టుకోవడం, అమ్మకం, సరఫరా, పంపిణీ, వినియోగం తదితరాలు.. 
 ఇయర్‌ బడ్స్, బెలూన్లు, ప్లాస్టిక్‌ జెండాలు, ఐస్‌క్రీం, క్యాండీలకు ఉపయోగించే ప్లాస్టిక్‌ స్టిక్స్‌ 
 అలంకరణకు ఉపయోగించే థర్మకోల్‌ 
 ప్లేట్లు, గ్లాసులు, ఫోర్క్‌లు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేల వంటి సామగ్రి 
 స్వీట్‌బాక్స్‌లు ప్యాకింగ్‌ చేసే ఫిల్మ్, ఇన్విటేషన్‌ కార్డులు, సిగరెట్‌ ప్యాకెట్లు 
 వంద మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్‌/ పీవీసీ బ్యానర్లు 

ఉల్లంఘనులపై జరిమానాలు... 
ఈ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించే వారి నుంచి జరిమానాలు వసూలు చేయాలని సీపీసీబీ నిర్ణయించింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని రాష్ట్రాల పీసీబీలు లేదా కాలుష్య నియంత్రణ కమిటీలకు కల్పించింది. రిటైల్‌ వ్యాపారులు, అమ్మకందారులు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగదారులపై జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జరిమానాలు విధించవచ్చు. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై రూ.500, పారిశ్రామిక వ్యర్థాలకు కారణమయ్యే వారికి రూ.5 వేల చొప్పున జరిమానా వేయొచ్చు. 

ప్రత్యామ్నాయాలివే... 
 పత్తి/ ఉన్ని/వెదురుతో తయారు చేసిన బ్యాగ్‌లు 
 స్పూన్లు, స్ట్రాలు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువుల స్థానంలో వెదురు లేదా ఇతర పదార్థాలతో తయారు చేసే వస్తువులను ఉపయోగించవచ్చు  
 వేడి పానీయాలు, ఇతర అవసరాల నిమిత్తం మట్టిపాత్రల వంటివి వాడొచ్చు.

మరిన్ని వార్తలు