దారుణం: ‘ప్లీజ్‌ మా చెల్లి వెంటపడొద్దు’

27 Mar, 2021 19:35 IST|Sakshi

లక్నో: తన చెల్లి వెంట ఒకరు వెంట పడుతున్నాడని తెలిసి సోదరుడు కల్పించుకుని అతడికి సర్ది చెప్పాడు. ఇదే ఆ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. తన చెల్లి వెంటపడొద్దని హితవు పలికిన అతడిని నలుగురు వ్యక్తులు కలిసి స్కార్ఫ్‌తో దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా మీ అబ్బాయిని కిడ్నాప్‌ చేశాం.. రూ.20 లక్షలు ఇస్తే వదిలేస్తామని ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. 

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌ జిల్లా బజ్‌హేర గ్రామానికి చెందిన సురేంద్ర పాల్‌ ఐటీఐ చదువుతున్నాడు. ఇటీవల తన చెల్లి వెంట స్థానికుడు శివకుమార్‌ వెంటపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సురేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన చెల్లి వెంట పడొద్దని హితవు పలికాడు. దూరంగా ఉండాలని.. ఇకపై కనిపించవద్దని వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో శివకుమార్‌ సరే అని చెప్పాడు. అయితే ఆమెకు దూరంగా ఉండడం శివ తట్టుకోలేకపోయాడు. జరిగిన విషయాన్ని శివ తన స్నేహితుడు భూపేంద్రకు చెప్పాడు. శివకు ఓదార్చిన భూపేంద్ర దీనికి ఓ పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చాడు.

ఈ క్రమంలో సురేంద్ర పాల్‌ను కిడ్నాప్‌ చేసి హత్య చేయాలని ప్రణాళిక రచించాడు. సురేంద్ర, భూపేంద్ర దూరపు బంధువులు. ఈ చనువుతో సురేంద్రను మద్యం సేవిద్దామని భూపేంద్ర పిలిపించాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరూ మద్యం సేవించారు. అయితే సురేంద్రకు పీకల దాక భూపేంద్ర మద్యం తాగించాడు. అనంతరం స్కార్ఫ్‌తో సురేంద్రను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మధురకు సమీపంలోని యమున నదిలో విసిరేశాడు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి ‘మీ అబ్బాయిని కిడ్నాప్‌ చేశాం. రూ.20 లక్షలు ఇస్తే వదిలేస్తాం’ అని బెదిరించారు. కంగారు పడిన కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఫోన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో శివకుమార్‌, రాహుల్‌ సింగ్‌, రతన్‌ సింగ్‌ పాత్ర కూడా ఉందని తేలింది. దీంతో వారిని అలీఘర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 364 ఏ, 302, 201 సెక‌్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. యమున నది తీరంలో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెల్లి ప్రేమ అన్న ప్రాణం మీదకు వచ్చిందని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. 

చదవండి: ‘ఇటుక’ దొంగతనం చేశాడని హీరోపై ఫిర్యాదు
చదవండి: ఆడియో క్లిప్‌ వైరల్‌: ‘నందిగ్రామ్‌లో సాయం చేయండి’

మరిన్ని వార్తలు