ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్‌ నోటీసులు

25 Nov, 2022 09:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అక్కడి ‘ఎమ్మెల్యేలకు ఎర’ వేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్‌ నోటీసులు జారీచేసింది. ఇప్పటికే అరెస్టయిన హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్‌ వ్యాపారి నందుకుమార్‌తో.. రఘురామకు సత్సంబంధాలు ఉన్నట్లుగా సిట్‌ గుర్తించడంతో ఆయనకు నోటీసులు అందజేసింది. నిందితుల సెల్‌ఫోన్లలో రఘురామకృష్ణరాజు దిగిన ఫొటోలు, ఇతర కీలక వివరాలు బయటపడడంతో ఎంపీని విచారించాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు. దీంతో 41–ఏ సీఆర్‌పీసీ కింద గురువారం ఆయనకు నోటీసులు జారీచేశారు.

ఈ నెల 29న ఉ.10:30 గంటలకు బంజారాహిల్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు రావాలని అందులో తెలిపారు. సహేతుక కారణం లేకుండా గైర్హాజరైతే 41–ఏ (3), (4) సీఆర్‌పీసీ కింద అరెస్టుచేస్తామని ఎంపీకి పంపిన ఈ–మెయిల్‌లో పేర్కొన్నారు. మరోవైపు.. ఎంపీకి ప్రత్యక్షంగా నోటీసులు అందించేందుకు సిట్‌ అధికారులు గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని రఘురామ నివాసానికి వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని సమాచారం. దీంతో ఢిల్లీ వెళ్లిన సిట్‌ బృందం ఆయన నివాసంలో నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి రఘురామకు ముందే సమాచారం ఉందేమోనని, ఎమ్మెల్యేలకు ఆఫర్‌ చేసిన నగదు సమకూర్చడంలో ఎంపీ పాత్ర ఉందేమోనని సిట్‌ అనుమానిస్తోంది. 

ఏడుకు చేరిన నిందితుల సంఖ్య
ఈ కేసులో తాజాగా మరో నలుగురిని సిట్‌ అధికారులు నిందితులుగా చేర్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్, కర్ణాటక బీడీజేఎస్‌ చీఫ్‌ తుషార్‌ వెల్లపల్లి, కేరళ వైద్యుడు కొట్టిలిల్‌ నారాయణ జగ్గు అలియాస్‌ జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా పేర్కొన్నారు. అలాగే, ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గుస్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్‌ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్‌ అలాగే జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌ఓ) ప్రతాపన్‌లు విచారణకు గైర్హాజరు కావటంతో తాజాగా 41–ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీచేశారు. ఈసారి కూడా హాజరుకాకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు.. జగ్గు ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లను  సిట్‌ బృందం స్వాధీనం చేసుకుంది. 

చదవండి: (వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..) 

మరిన్ని వార్తలు