కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడు మృతి

22 Apr, 2021 12:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు  పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడి మృతి చెందారు. తాజాగా సీపీఎం సీనియర్‌ నేత సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్‌ ఏచూరి మరణించారు. ఇటీవల ఆశిష్‌కు కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆయన్ని చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం ఆశిష్‌ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీతారాం ఏచూరి ట్విటర్‌లో పేర్కొన్నారు.

‘ఈ రోజు ఉదయం నా పెద్ద కొడుకు ఆశిష్ ఏచూరీ కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరం. ఆశిష్‌ను బతికించడానికి చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు. వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు మాకు అండగా నిలిచారు’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 34 ఏళ్ల ఆశిష్‌ ఓ ప్రముఖ వార్తాపత్రికలో  సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు.

మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మృతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కన్నుమూశారు. కాంగ్రెస్‌ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.కె.వాలియా గురువారం మృతి చెందారు. ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు.

దీంతో ఆయనకు చికిత్స అందించడం కోసం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. వాలియా వరుసగా నాలుగుసార్లు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
చదవండి: రాష్ట్రాలకు రూ.400లకు డోసు

మరిన్ని వార్తలు