దేశవ్యాప్త లాక్‌డౌన్‌: నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు

14 Apr, 2021 12:12 IST|Sakshi

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఉండబోదు:  కేంద్ర ఆర్థికమంత్రి

ఆర్థిక వ్యవస్థను పూర్తిగా స్థంభించనీయం: నిర్మలా సీతారామన్‌

టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, నిబంధనల అమలు వ్యూహం

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప‍్తంగా కరోనా వైరస్‌ రెండవ దశలో తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 విస్తరణను అడ్డుకునే చర్యల్లో ప్రభుత్వం పూర్తి లాక్‌డౌన్  విధించబోదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించమని, స్థానికంగానే నియంత్రణా చర్యల్ని చేపడతామని ఆమె  వెల్లడించారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టడం తమకిష్టంలేదని ఆమె పేర్కొన్నారు. కరోనా కట్టడికి ఆయా కంటైన్‌మెంట్ జోన్లలో కఠిన చర్యలపై మాత్రమే ఆధారపడతాన్నారు. ఆయా రాష్ట్రాల  కోవిడ్‌ సమాచారాన్ని సేకరించామని, చర్యలు బావున్నాయని ఆర్థికమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. (విజృంభిస్తున్న కరోనా: కొత్తగా వెయ్యికిపైగా మరణాలు )

ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్‌పాస్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో నిర్మలా సీతారామన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలతో పాటు ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్ ప్రభావాల గురించి మాట్లాడారు. కరోనా సెకండ్‌వేవ్‌లో కూడా,  భారీ లాక్‌డౌన్‌ దిశగా తాము పోవడంలేదన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, కరోనా నిబంధనలు లాంటి ఐదు స్థంభాల వ్యూహంతో కరోనాను కట్టడి చేస్తామన్నారు. వైరస్‌ బారిన పడిన వారి హోం క్వారంటైన్ చేస్తామని ఆమె తెలిపారు. అలాగే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే భారతదేశానికి ఆర్థిక లభ్యతను, రుణ సామర్థ్యాన్ని పెంచేందుకు  ప్రపంచ బ్యాంక్ చేపట్టిన చర్యలను సీతారామన్ ప్రశంసించారు.

కాగా దేశంలో రికార్డు కేసులతో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రెండు లక్షలకు చేరువలో ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. ఈ నేపథ‍్యంలో పలు రాష్ట్రాలు  ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ  అమలు  చేస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని, రాష్ట్రాలే కఠిన నిబంధనలు అమలు చేయాలని స్పష‍్టం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాలు ఈ మేరకు రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు