పాంగాంగ్‌ ప్రాంతంలో చైనా దళాల దూకుడు

9 Sep, 2020 16:54 IST|Sakshi

సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ప్రతిష్టంభనపై సైనిక కమాండర్ల స్థాయిలో సంప్రదింపులు జరుగుతుండగానే దొంగదెబ్బ తీస్తున్న డ్రాగన్‌కు బుద్ధిచెప్పేందుకు భారత సైన్యం సన్నద్ధమైంది. చైనా కదలికలను పసిగట్టి దీటుగా ప్రతిఘటించేందుకు సాధనా సంపత్తితో సంసిద్ధమైంది. భారత్‌-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో బుధవారం పాంగాంగ్‌ ప్రాంతంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) పెద్దసంఖ్యలో దళాలను మోహరించింది. సైనిక దళాలను భారీగా మోహరించడంతో పాటు ఈ ప్రాంతానికి ఆయుధ సామాగ్రి, పలు మెటీరియల్స్‌ను తరలిస్తోంది. మరోవైపు డ్రాగన్‌ దూకుడుతో భారత సైన్యం తన స్ధావరాల్లో బలగాలను పెంచడంతో పాటు సుఖోయ్‌-30, ఎంఐజీలతో సహా పలు యుద్ధ విమానాలను సిద్ధం చేసిందని సమాచారం. ఇక ఆగస్ట్‌ 29 రాత్రి చైనా దళాలు ఈ ప్రాంతంలోకి చొచ్చుకువచ్చి పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరాన యథాతథ స్థితిని మార్చేందుకు చేసిన ప్రయత్నాన్ని భారత దళాలు తిప్పికొట్టిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెచ్చుమీరాయి.

మరోవైపు చైనా దూకుడుతో అప్రమత్తమైన భారత సైన్యం పాంగాంగ్‌ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో అప్రమత్తమైంది. చైనా దుందుడుకు చర్యలను తిప్పికొట్టేందుకు ఆయా ప్రాంతాల్లో భారత సైన్యం అదనపు దళాలను మోహరించింది. ఈనెల ఏడున సైతం తూర్పు లడఖ్‌లో పీఎల్‌ఏ దళాలు భారత భూభాగం వైపు చొచ్చుకువచ్చి గాలిలోకి కాల్పులు జరిగిన అనంతరం భారత్‌ దీటుగా బదులివ్వడంతో డ్రాగన్‌ సేన తోకముడిచింది. పీఎల్‌ఏ ఏకంగా కాల్పులకు తెగబడటం చైనా దుస్సాహస్సాన్ని వెల్లడించింది. భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కాల్పుల స్థాయికి చేరడం ఆందోళనకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరుదేశాల రక్షణ శాఖల మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, జనరల్‌ వీ ఫెంగ్‌ నిర్ణయించిన మూడు రోజులకే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇక పాంగాంగ్‌ ప్రాంతంలో చైనా సేనల కదలికలు కొనసాగుతుండటంతో భారత సైన్యం సైతం అప్రమత్తమైంది. చదవండి : సరిహద్దుల్లో బాహాబాహీ : మళ్లీ రెచ్చిపోయిన డ్రాగన్‌

మరిన్ని వార్తలు