రాజీవ్‌ హత్య కేసు: సుప్రీంకోర్టు తీర్పు మాకు అంగీకారం కాదు.. సోనియా కుటుంబం క్షమించినా..

11 Nov, 2022 14:10 IST|Sakshi

ఆరుగురి విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం\

30 ఏళ్లకు పైగా జైల్లో ఉన్న దోషులు

ఇప్పటికే విడుదలైన పెరారివాళన్‌

తప్పుడు నిర్ణయమన్న కాంగ్రెస్‌

స్వాగతించిన డీఎంకే, అన్నాడీఎంకే

న్యూఢిల్లీ: దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న మొత్తం ఆరుగురు దోషుల ముందస్తు విడుదలకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో దోషిగా 30 ఏళ్లకు పైగా శిక్ష అనుభవించిన ఎ.జి.పెరారివళన్‌ సుప్రీంకోర్టు ఆదేశం మేరకు గత మే 18న విడుదలవడం తెలిసిందే. మిగతా దోషులకూ అదే వర్తిస్తుందని న్యాయమూర్తులు బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘వారికి క్షమాభిక్ష పెట్టాలంటూ గతంలోనే తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. దీంతోపాటు దోషుల సత్ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకున్నాం’’ అని తెలిపింది.

దాంతో 30 ఏళ్లకు పైగా జైల్లో ఉన్న ఎస్‌.నళిని, ఆమె భర్త వి.శ్రీహరన్‌ అలియాస్‌ మురుగన్, ఆర్‌.పి.రవిచంద్రన్, జయకుమార్, రాబర్ట్‌ పయస్, శంతన్‌కు విముక్తి లభించింది. శ్రీహరన్, శంతన్, రాబర్ట్, జయకుమార్‌ శ్రీలంక దేశస్తులు. నళిని, రవిచంద్రన్‌ ముందస్తు విడుదలకు పెట్టుకున్న పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సహ దోషి పెరారివాళన్‌ విడుదలను కోర్టు దృష్టికి తెచ్చారు. 2021 డిసెంబర్‌ 27 నుంచి వారిద్దరూ పెరోల్‌పై బయటే ఉన్నారు. మిగతా నలుగురు తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయం. మాకెంతమాత్రమూ అంగీకారం కాదు. కోర్టు సరైన స్ఫూర్తితో వ్యవహరించలేదు’’ అని పార్టీ నేతలు రణ్‌దీప్‌ సుర్జువాలా, అభిషేక్‌ సింఘ్వి, జైరాం రమేశ్‌ తదితరులన్నారు. సుప్రీం తీర్పుపై సమీక్ష కోరడమా, న్యాయపరంగా ఇతరత్రా చర్యలు చేపట్టడమా యోచిస్తున్నట్టు స్పష్టం చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు విన్పించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

మాజీ ప్రధానిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల విడుదలను సమర్థిస్తారో, లేక తీర్పుపై సమీక్ష కోరతారో మోదీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘దోషులను సోనియా, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ క్షమించి ఉండవచ్చు. అది వారి గొప్పదనం. కానీ పార్టీగా వారి నిర్ణయాన్ని మాత్రం కాంగ్రెస్‌ సమర్థించబోదు. ఈ విషయంలో పార్టీ వైఖరి   ముందునుంచి ఒకేలా ఉంది’’ అని చెప్పారు. తమిళనాట మాత్రం కాంగ్రెస్‌ భాగస్వామ్య పక్షమైన అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే దోషుల విడుదలను స్వాగతించాయి. ఇది చరిత్రాత్మక తీర్పని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్‌ అన్నారు. 

నళిని తల్లి హర్షం 
సుప్రీం తీర్పు పట్ల నళిని తల్లి ఎస్‌.పద్మ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ‘‘అంతులేని ఆనందమిది. నళిని, మేమంతా ఇంతకాలం అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు’’ అన్నారు. పెరోల్‌పై బయట ఉన్నందున తీర్పుపై స్పందించేందుకు నళిని నిరాకరించింది. ఆమె కూతురు ప్రస్తుతం లండన్లో ఉంటోంది. 

ఆ రోజు ఏం జరిగింది...? 
1991 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 21న రాజీవ్‌గాంధీ తమిళనాడులో చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరులో రాత్రి వేళ సభలో పాల్గొన్నారు. రాత్రి 10:10 సమయంలో శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన తెన్‌మొళి రాజారత్నం అలియాస్‌ థాను అనే ఎల్టీటీఈ మహిళా ఆత్మాహుతి దళ సభ్యురాలు ఆర్డీఎక్స్‌తో కూడిన బెల్టు బాంబు పెట్టుకుని రాజీవ్‌ను సమీపించింది. ఆయనకు పూలమాల వేసింది. కాళ్లకు మొక్కేందుకన్నట్టుగా కిందకు వంగింది. ఆమెను పైకి లేపేందుకు రాజీవ్‌ కాస్త ముందుకు వంగుతూనే తనను తాను పేల్చేసుకుంది. దాంతో రాజీవ్‌ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 14 మంది కూడా మరణించారు. ఎల్టీటీఈని అడ్డుకునేందుకు శ్రీలంక ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు శాంతి పరిరక్షణ దళం పేరిట అక్కడికి భారత సైన్యాన్ని పంపుతూ ప్రధానిగా రాజీవ్‌ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహించి సంస్థ అధిపతి వేలుపిళ్లై ప్రభాకరన్‌ ఈ దురాగతానికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. 

విచారణలో మలుపులు 
1991 మే 21: రాజీవ్‌ హత్య. ఈ కేసులో ఏడుగురి అరెస్టు. నళిని ఆ సమయంలో గర్భవతి. జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 
1991 జూన్‌ 11: పెరారివాళన్‌ను అరెస్టు చేసిన సిట్‌. టాడా చట్టం కింద కేసు.
1991: బెంగళూరులో పేలుడు సూత్రధారి శివరాసన్‌ తలదాచుకున్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు. దాంతో మరో ఆరుగురితో కలిసి శివరామన్‌ ఆత్మహత్య. 
1992: రాజీవ్‌ హత్యలో ఎల్టీటీఈ పాత్ర ఉందని తేల్చిన సిట్‌. 1990లోనే జాఫ్నా అడవుల్లో ఇందుకు ఎల్టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ పథక రచన చేసినట్టు వెల్లడి.
1998: మురుగన్, సంథాను, పెరారివళన్, నళిని సహా మొత్తం 26 దోషులకు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. 
1999: నలుగురు నిందితుల అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మురుగన్, శంతను, పెరారివాళన్, నళినిలకు కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది. ముగ్గురికి జీవితకాల శిక్ష విధిస్తూ మిగతా 19 మందిని వదిలేసింది.  నళిని, మురుగన్, శంతను, పెరారివాళన్‌ క్షమాభిక్ష అభ్యర్థనను తమిళనాడు ప్రభుత్వం 
తోసిపుచ్చింది. 

2001: శంతను, మురుగన్, పెరారివాళన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ తిరస్కరించారు. ముగ్గురికి విధించాల్సిన మరణశిక్షపై మద్రాస్‌ హైకోర్టు సెప్టెంబర్‌ 9న స్టే విధించింది. దాన్ని జీవితకాల శిక్షకు తగ్గించాలన్న తీర్మానానికి నాటి తమిళనాడు సీఎం జయలలిత ఆమోదం తెలిపారు. 
2011: రాజీవ్‌ను హత్య చేసినందుకు భారత్‌కు ఎల్టీటీఈ క్షమాపణ. 
2014: రాజీవ్‌ భార్య సోనియా గాంధీ అభ్యర్థన మేరకు నళిని మరణశిక్షను జీవితకాల శిక్షగా తగ్గించిన సుప్రీంకోర్టు. 
2018: మొత్తం ఏడుగురు నిందితులనూ విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్‌ సిఫార్సు. 
2019: నళినికి తొలిసారి పెరోల్‌.
2021: నళిని, రవిచంద్రన్‌లకు పెరోల్‌. 
2022: సుప్రీంకోర్ట్‌ తీర్పుతో మే 18న పెరారివాళన్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. 
2022 సెప్టెంబర్‌: నళిని, రవిచంద్రన్‌ విడుదలకు సుప్రీంకోర్ట్‌ ఆదేశం. 
నవంబర్‌ 2022: మిగతా ఆరుగురు దోషులను కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్ట్‌ తీర్పు.   

మరిన్ని వార్తలు