పాక్‌ ప్రేరేపిత ఉగ్ర కుట్ర భగ్నం 

15 Sep, 2021 01:05 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న పోలీస్‌ అధికారులు  

నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలే టార్గెట్‌ 

ఇద్దరు ఉగ్రవాదులతో సహా ఆరుగురి అరెస్టు 

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం 

దావూద్‌ సోదరుడి హస్తం ఉందన్న ఢిల్లీ పోలీసులు 

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద కుట్రను ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ సెల్‌ భగ్నం చేసింది. పాక్‌– ఐఎస్‌ఐ వద్ద శిక్షణ పొందిన ఇద్దరు టెర్రరిస్టులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలను లక్ష్యంగా చేసుకొని దేశవ్యాప్తంగా పలు పేలుళ్లకు వీరు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో జాన్‌ మహ్మద్‌ షేక్‌ అలియాస్‌ సమీర్, ఒసామా, మూల్‌చంద్, జేషన్‌ ఖమర్, మహ్మద్‌ అబూ బకర్, మొహ్మద్‌ అమీర్‌ జావెద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒసామా, ఖమర్‌లు ఐఎస్‌ఐ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులని పోలీసులు వెల్లడించారు.

ఢిల్లీ, యూపీల్లో ఐఈడీ(పేలుడు పదార్థం) ఉంచేందుకు సరైన ప్రదేశాలను వెతకడానికి వీరిని నియమించినట్లు తెలిపారు. వీరి అరెస్టుతో పాక్‌– ఐఎస్‌ఐ– ఉగ్రవాదుల సంబంధం బయటపడిందని,  అండర్‌వరల్డ్‌ సహకారంతో ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో పలు పేలుళ్లు జరిగే ప్రమాదాన్ని నివారించినట్లయిందని స్పెషల్‌ సెల్‌ డీసీపీ ప్రమోద్‌ సింగ్‌ చెప్పారు. అలహాబాద్‌లో జరిపిన సోదాల్లో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉగ్రకుట్రలో వివిధ పనులు చేసేందుకు వీరంతా నియమితులయ్యారన్నారు. అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరుడు అనీస్‌ ఇబ్రహీంకు సమీర్‌ దగ్గరి వాడన్నారు. పాక్‌లో ఉంటున్న అనీస్‌ ఆదేశాల మేరకు పేలుడు పదార్థాలను, ఆధునిక ఆయుధాలను, గ్రెనేడ్లను భారత్‌లోని వివిధ ప్రాంతాల్లోని టెర్రరిస్టులకు అందించేందుకు సమీర్‌ తయారయ్యాడన్నారు.  


మూల్‌చంద్, ఆమిర్‌ జావెద్‌  

రాజకీయ ర్యాలీలే లక్ష్యం? 
వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల వేళ జరిగే రాజకీయ ర్యాలీలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొనే అవకాశాలను కొట్టిపారేయలేమని పోలీసులు తెలిపారు. తమ గ్రూపులో 14–15 మంది బెంగాలీ మాట్లాడే వాళ్లున్నారని అరెస్టయిన ఉగ్రవాదులు వెల్లడించినట్లు చెప్పారు. వీరంతా కూడా ఉగ్రట్రైనింగ్‌ తీసుకొని ఉండొచ్చని, వీరికి పాక్‌ నుంచి సహకారం అందుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడిని నిర్వహించేందుకు టెర్రరిస్టులు రెండు బృందాలుగా ఏర్పడ్డారని, ఒక బృందాన్ని అనీస్‌ సమీక్షిస్తుంటాడని చెప్పారు. రెండో బృందం హవాలా మార్గాల్లో నిధులు సమీకరించడానికి సన్నాహాలు చేస్తుందని తెలిపారు. కేంద్ర ఏజెన్సీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పలు రాష్ట్రాల్లో ఈ సోదాలు నిర్వహించామని, రాజస్తాన్‌లోని కోట వద్ద ఒకరిని, ఢిల్లీలో ఇద్దరిని, యూపీలో ముగ్గురిని అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన ఓఖ్లా అనే వ్యక్తి ఈ కుట్రలో కీలకమని, ఇతనికి దేశవ్యాప్తంగా సంబంధాలున్నాయని చెప్పారు. ఒసామా, ఖమర్‌లు మస్కట్‌ మీదుగా పాక్‌ వెళ్లి 15 రోజుల పాటు థట్టా వద్ద ఉన్న ఒక క్యాంపులో ఉగ్రవాద శిక్షణ పొందారని చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌లో ఒక లైవ్‌ ఎల్‌ఈడీని బాంబు స్క్వాడ్‌ నిర్వీర్యం చేసింది. టెర్రరిస్టు కుట్రను సమూలంగా ఛేదించేందుకు సమగ్ర దర్యాప్తు ఆరంభించామని పోలీసులు తెలిపారు.  

మహ్మద్‌షేక్‌ కుటుంబసభ్యులను ప్రశ్నించిన ఏటీఎస్‌ 
ఢిల్లీలో అరెస్టయిన ఉగ్రవాది జాన్‌ మహ్మద్‌ షేక్‌ కుటుంబ సభ్యులను ముంబై పోలీసులు, ఏటీఎస్‌ అధికారులు విచారించారు. షేక్‌ ఇంట్లో సోదాలు సైతం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్‌ ముంబైలో షేక్‌ కుటుంబం ఉంటోంది. కొన్నేళ్లుగా ఇక్కడే షేక్‌ నివాసముంటున్నాడని, అతనికి ఇద్దరు కూతుర్లున్నారని పోలీసులు చెప్పారు.  జాన్‌ గురించి ఇరుగుపొరుగును కూడా పోలీసులు విచారించారు. జాన్‌కు ఉగ్రవాదులతో ఏలా సంబంధం ఏర్పడిందన్న విషయమై ఆరాతీశారు.

మరిన్ని వార్తలు