బెంగళూరు ఎయిర్‌పోర్టులో పేలుడు

8 Jun, 2021 08:14 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో టెర్మినల్‌ రోడ్డు మార్కింగ్‌ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు  కార్మికులు గాయపడ్డారు. ఎయిర్‌పోర్టులోని కార్గో కాంప్లెక్స్‌ ముందు భాగంలో రెండవ టెర్మినల్‌ కోసం రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున కార్మికులు రోడ్డుకు ఇరువైపులా యంత్రం సహాయంతో తెల్లరంగు మార్కింగ్‌లు, జీబ్రా లైన్లు పూస్తున్నారు. తెల్లరంగు తయారీ కోసం సిలిండర్‌లో రసాయనాలు వేసి వేడి చేస్తుండగా సిలిండర్‌ పేలింది.

ఆ మంటలు పక్కనే నిల్వ ఉంచిన రంగుడబ్బాలకు అంటుకున్నాయి. ఈ ఘటనలో అవినాశ్, సిరాజ్, ప్రశాంత్, గౌతమ్, అజయ్‌కుమార్, నాగేశ్‌రావ్‌ అనే ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై విమానాశ్రయ వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు.

(చదవండి: దారుణం: భార్యా.. పిల్లలను బావిలో నెట్టివేసి భర్త.. ఆపై రాళ్ల దాడి)

మరిన్ని వార్తలు