24 గంటల్లో 60 వేలకు పైనే..

26 Aug, 2020 03:33 IST|Sakshi

7 లక్షలు దాటిన కోవిడ్‌ యాక్టివ్‌ కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో మంగళవారం మరో 60,975 కోవిడ్‌–19 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,67,323కు చేరుకుంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 66,550 మంది కోలుకోగా, 848 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 58,390కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 24,04,585కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,04,348గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 22.24గా ఉంది. యాక్టివ్‌ కేసుల కంటే 3.41 రెట్లు కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు 75.92 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.84 శాతానికి పడిపోయిందని తెలిపింది.  ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,59,02,137కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 8.60కు చేరింది.  ప్రతి 10లక్షల మందికి 26,685 పరీక్షలను చేశారు. దేశంలో మొత్తం 1524 ల్యాబుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు.  

కరోనా రెండోసారి..
హాంకాంగ్‌: కరోనా వైరస్‌ రెండోసారి కూడా సోకుతుందని హాంకాంగ్‌లో నిర్ధారితమైంది. హాంకాంగ్‌కు చెందిన 33 ఏళ్ల యువకుడికి మార్చిలో ఒకసారి రాగా, తాజాగా మళ్లీ కరోనా సోకింది. ఆగస్టు మధ్యలో అతడు స్పెయిన్‌ వెళ్లి రావడంతో కరోనా వచ్చింది. అయితే అతడికి మార్చిలో వచ్చిన కరోనాతో పోలిస్తే ప్రస్తుతమున్న వైరస్‌ భిన్నంగా ఉందని డాక్టర్‌ కెల్విన్‌ కై వాంగ్‌ తెలిపారు. మొదటిసారి కొద్దిమేర లక్షణాలు ఉండగా, రెండోసారి అసలు లక్షణాలు లేవని గుర్తించారు. దీన్ని బట్టి కొంత మందిలో జీవితకాల రోగనిరోధకత ఉండదని అర్థమవుతోందని చెప్పారు. కరోనా రెండోసారి తిరిగి సోకిన వారి సంఖ్య ఎక్కువే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కరోనా రెండోసారి వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో శరీర రోగనిరోధక వ్యవస్థ జ్ఞాపకం పెట్టుకుని యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు కూడా జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలని చెప్పారు. కరోనా తిరిగి సోకే అవకాశముందని అమెరికా నిపుణులు కూడా అంటున్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా