తుపాను గాలికి బయటపడ్డ 5 అస్థి పంజరాలు

30 May, 2021 14:14 IST|Sakshi

సముద్రతీరంలో ఇసుకలో పాతి పెట్టిన మృతదేహాలు

తుపాను గాలి తీవ్రతకు  కొట్టుకుపోయిన ఇసుక

బయటపడ్డ ఐదుగురి హత్యల రహస్యం ?

విచారణకు ఆదేశించిన తమిళనాడు ప్రభుత్వం

రామనాథపురం: యాస్‌ తుపాను గాలుల తీవ్రతకు తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పాతిపెట్టిన రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. రోజుల తరబడి బలమైన గాలులు వీచడంతో తీరంలో ఉన్న ఇసుక రేణువులు కొట్టుకుపోయి .. అందులో నుంచి ఐదు అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇంతకీ ఈ అస్థి పంజరాలు ఎవరివి, ఎలా ఇక్కడకు వచ్చాయి. ఇవి సాధారణ మరణాలా లేక హత్యలా అనేది తేలాల్సి ఉంది. 

రామనాథపురం జిల్లాలో
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో వలినొక్కం గ్రామం ఉంది. బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ గ్రామంలో ఐదు వందల మత్స్యకార జనాభా  జీవిస్తున్నారు. అయితే  తుపాను సందర్భంగా గ్రామ సమీపంలో ఐదు అస్థిపంజరాలను స్థానికులు కనుక్కొన్నారు. ఇటీవల వీచిన గాలుల తీవ్రతకు ఇసుక కొట్టుకుపోయి తొలుత ఒక అస్థి పంజరం కనిపించింది. ఆ తర్వాత వరుసగా ఒకదాని వెంట ఒకటిగా ఐదు అస్థిపంజరాలను గ్రామస్తులకు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


విచారణకు ఆదేశం
సముద్ర తీరంలో వెలుగు చూసి ఐదు మృతదేహాలు స్థానికులవా లేక  పొరుగు గ్రామాలకు చెందినవా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులు క్షేమంగా ఉన్నారా ? లేదా అనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. ఆ తర్వాత సమీప పోలీస్‌ స్టేషన్లలో పాత మిస్సింగ్‌ కేసుల రికార్డులు పరిశీలిస్తున్నారు. అస్థిపంజరాల నమూనాలను ఫొరెన్సిక్‌, డీఎన్‌ఏ ల్యాబ్‌లకు పంపించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న సైకో కిల్లర్ల్స్‌ కదలికలపైనా నిఘా పెట్టారు. అయితే ఇప్పటి వరకు పోలీసులకు బలమైన క్లూలు ఏవీ లభించలేదు. మరోవైపు ఈ అస్థిపంజరాల వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం.

మరిన్ని వార్తలు