వైరల్‌ వీడియో: పామును చూసిన పిల్లికి గుండె ఝల్లుమంది

4 May, 2021 12:47 IST|Sakshi

ఒక పిల్లి చెట్ల మధ్యలో ఉన్న ఒక పాత బస్సు సీటు మీద నిద్రపోతుంది. వేటాడి అలిసిపోయిందో, ఏమోగానీ గట్టిగా కళ్లుమూసుకుని, వెల్లకిలా పడుకుంది. మధ్యమధ్యలో అటూఇటూ తిరుగుతూ ఒళ్లు విరుస్తోంది. ఈ క్రమంలో..  ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ ఒక పాము అక్కడ ప్రత్యక్షమైంది. అది నెమ్మదిగా పిల్లి మీద పాకడం మొదలుపెట్టింది. అయితే, మంచి నిద్రలో ఉన్న పిల్లి.. శరీరం మీద ఏదో కదులుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. 

కానీ ఇంకా తన శరీరం మీద ఏదో కదులుతూ సౌండ్‌ వినిపించేసరికి మెల్లగా కళ్లు తెరచింది. తన శరీరం మీద పాకుతున్నది ఏంటబ్బా అని గమనించి చూసింది. అంతే, దాని గుండె ఝల్లుమంది. అక్కడుంది ఏదో తాడు కాదు.. ఒక పాము.. వెంటనే షాక్‌కు గురైన పిల్లి,  గాలిలోకి ఎగిరి అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఫన్నీ వీడియో జనాలకు నవ్వు తెప్పిస్తోంది.  దీన్ని చూసిన నెటిజన్లు.. పాపం.. పిల్లి నిద్రను పాము చెడకొట్టిందని అంటున్నారు. మరికొందరేమో వావ్‌.. పిల్లి గాల్లో​ బంతిలాగా ఎగిరిందని, పిల్లికి ఇంకా భూమి మీద నూకలున్నాయని సరదాగా  కామెంట్లు పెడుతున్నారు. 

మరిన్ని వార్తలు