పీయూసీలో 94శాతం మార్కులు.. ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం

27 Jul, 2020 17:17 IST|Sakshi

బెంగళూరు: కార్‌ వాష్‌ చేస్తూ.. జీవనం సాగించే షంషుద్దీన్‌ అధోనికి ముగ్గురు కుమార్తెలు. ఆడపిల్లలని వారిని తక్కువ చేయలేదు. ముగ్గురిని బాగా చదివించాలనేది అధోని కల. తండ్రి ఆశయానికి తగ్గట్టే పిల్లలు కూడా చదువులో ముందుంటారు. ఈ క్రమంలో తాజాగా వెల్లడించిన ప్రీ యూనివర్సిటీ కాలేజ్(పీయూసీ)‌ పరీక్షల్లో అధోని పెద్ద కుమార్తె జీనత్‌ బాను 94 శాతం మార్కులు సాధించింది. పీసీఎంబీ(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయోలజీ) కోర్సు పూర్తి చేసింది. త్వరలో నిర్వహించబోయే నీట్‌ ఎగ్జాం కోసం కష్టపడుతోంది. డాక్టర్‌ కావాలనేది జీనత్‌​ కల. అయితే ఇలాంటి సమయంలో కరోనా వారి ఆశలకు అడ్డుగా నిలిచింది. వైరస్‌ కట్టడి కోసం దేశవ్యాప్తంగా విద్యాసంస్థలన్నింటిని మూసి వేసిన సంగతి తెలిసిందే. (ఆన్‌లైన్‌ చదువు కోసం ఆవు అమ్మకం)

ఇలాంటి సమయంలో ప్రస్తుతం అన్ని ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లకు సంబంధించి కోచింగ్‌, ప్రాక్టీస్‌ ఆన్‌లైన్‌ వేదికగానే జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులకు అటెండ్‌ కావాలంటే స్మార్ట్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ ఏదైనా  ఉండాలి. నెట్‌ కనెక్షన్‌ కూడా కావాలి. కానీ నెలకు కేవలం ఆరు వేల రూపాయల సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్న అధోనికి స్మార్ట్‌ ఫోన్‌ కొనడం అనేది తలకు మించిని భారం. ఇప్పటికే పిల్లల చదువుల కోసం భార్య ఒంటి మీద ఉన్న బంగారాన్ని అమ్మాడు.. అప్పులు చేశాడు. ప్రస్తుతం ఏ దారి కనిపించకపోవడంతో.. ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నాడు. 
 

మరిన్ని వార్తలు