ధూమపానంతో నలుగురు పిల్లల ఆహుతి!

13 Nov, 2020 17:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రిలే హోల్ట్‌కు 8 ఏళ్లు, కీగన్‌ యునిట్‌కు ఆరేళ్లు, టిల్లీ రోజ్‌ యునిట్‌కు నాలుగేళ్లు, ఒల్లి యునిట్‌కు మూడేళ్లు. వారి తల్లి నటాలియా యునిట్, తండ్రి క్రిస్టఫర్‌ మౌల్టెన్‌ నిర్లక్ష్యం కారణంగా నలుగురు పిల్లలు అగ్నికి ఆహుతై మరణించారు. ఇంగ్లండ్‌లోని స్టఫోర్డ్‌ పట్టణంలో వారు ఉంటున్న ఇంట్లో ఈ ఘోరం జరిగింది. వారి మాస్టర్‌ బెడ్‌ రూమ్‌లో తలెత్తిన మంటలు, ఇంటి మొత్తాన్ని ఆవరించి కబళించాయి. నలుగురు పిల్లలు పొగకు ఊపిరాడక ముందే చనిపోగా, భార్యా భర్తలు ఎలాగోఅలాగా ఇంటి నుంచి బయట పడి ప్రాణాలు రక్షించుకున్నారు.

అగ్ని మాపక దళం ఆ ఇంటికెళ్లి మంటలను ఆర్పేసేటప్పటికీ ఆ ఇంటి మాస్టర్‌ బెడ్‌ రూమ్‌ ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడే తాగేసిన సిగరెట్‌ పీకలు కనిపించాయి. ఓ యాష్‌ మంటలకు పూర్తిగా దగ్ధం కాగా, మరో యాష్‌ ట్రే సిగరేట్‌ పీకలతో అలాగే నిండుగా ఉంది. ఆ ఇంటికి వంట గదికి ఆవల కొన్ని వందల సిగరెట్‌ పీకలున్నాయి. భార్యాభర్తలిద్దరికి సిగరెట్లు తాగే అలవాటు ఉండడంతో వారి నిర్లక్ష్యం కారణంగానే ఇంతటి ఘోరం జరిగి ఉంటుందని కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు భావించారు.

గత ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ దారుణంపై గురువారం సౌత్‌ స్టఫోర్డ్‌షైర్‌ కొరోనర్స్‌ కోర్టులో పూర్తి స్థాయి విచారణ జరిగింది. ఫైర్‌ ఇనివెస్టిగేటర్‌ లీగ్‌ రిచర్డ్స్‌తోపాటు ఐదుగురు సాక్షులను కోర్టు విచారించగా, ఎవరు కూడా అసలు కారణం ఏమిటో స్పష్టంగా చెప్పలేక పోయారు. మాస్టర్‌ బెడ్‌ రూమ్‌లో తల్లి దండ్రులు సిగరెట్లు తాగడం వల్ల బెడ్‌ అంటుకొని, మంటలు వ్యాపించి ఉండవచ్చని, అయితే ఇంటి మొత్తాన్ని దగ్ధం చేసే పరిస్థితి లేదని, సిగరెట్‌ పీకలతో ఉన్న మరో యాష్‌ ట్రే అలాగే ఉండడం, మాస్టర్‌ బెడ్‌ రూమ్‌కున్న ఓ కిటికీ అద్దం చెక్కు చెదరకుండా ఉండడం చూస్తుంటే ఇంకేవో మంటలను ప్రేరేపించి ఉంటాయని లీగ్‌ రిచర్డ్స్‌ అభిప్రాయపడ్డారు.

ఇంటి పెరట్లో ఉన్న బాయ్‌లర్‌ కారణంగా మంటలు ప్రకోపించి ఉంటాయని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేయగా, దాన్ని రిచర్డ్స్‌తో పాటు ఆ పిల్లల తల్లిదండ్రులు ఖండించారు. పిల్లల్లో ఒక్కరు కూడా బతికి లేకపోవడం, తాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంటలు అంటుకున్నాయంటూ తల్లిదండ్రులు వాదిస్తూ రావడంతో వారి నిర్లక్ష్యమా, లేక పిల్లల తెలియని తనం వల్లనా, మరే ఇతర కారణాలతో అగ్ని ప్రమాదం సంభించిందా అన్న విషయాన్ని కోర్టు ఈసారి కూడా తేల్చలేక పోయింది. గతంలో లాగా తల్లిదండ్రులను ఈసారి కూడా బెయిల్‌పై విడుదల చేశారు. 

మరిన్ని వార్తలు