రాహుల్‌ ఇలాఖా.. ఇక స్మృతీ ఇరానీ అడ్డా

23 Feb, 2021 22:32 IST|Sakshi

ఆమేఠి: లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నెరవేర్చనున్నారు. ఈ మేరకు పనులు మొదలుపెట్టారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఇలాఖాగా ఉన్న ఆమేఠీని స్మృతి చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమేఠిలో తాను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నట్లు స్మృతి ఇరానీ తెలిపారు. త్వరలోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని స్థానికులకు పూర్తిగా అందుబాటులో ఉంటానని చెప్పారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమేఠిలో సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ గాంధీ మరోసారి పోటీ చేశారు. అయితే రాహుల్‌ను ఓడిస్తానని సవాల్‌గా తీసుకుని స్మృతి ఇరానీ మొదటిసారి ఆమేఠి నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. హోరాహోరి ప్రచారం చేసి చివరకు రాహుల్‌గాంధీని ఓడించి స్మృతి ఇరానీ సంచలనం సృష్టించారు. అయితే స్మృతి ఇరానీ పోటీతో భయపడి కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ పోటీ చేశారని రాజకీయాల్లో టాక్‌ ఉంది. అందుకే రాహుల్‌ ఆమేఠిలో ఓటమి పాలవగా వయనాడ్‌లో గెలిచాడు.

అయితే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ స్థానికంగా ఉండడని, ఢిల్లీలో తిష్టవేసి ఆమేఠిని పట్టించుకోవట్లేదని చెప్పి స్థానిక ఓటర్లకు గాలం వేశారు. తాను గెలిస్తే ఆమేఠిలో ఇంటి నిర్మాణం చేసుకుని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో స్మృతి ఇరానీ ప్రకటించారు. దీంతో స్థానికులు స్మృతి ఇరానీకి భారీగా ఓట్లు గుద్దేశారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్మృతి ఇరానీ ఇంటి నిర్మాణం పనులు మొదలుపెట్టారు. సోమవారం ఇంటికి సంబంధించిన స్థలం రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు.

త్వరలోనే ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తానని.. దీనికి ఆమేఠి నియోజకవర్గ ప్రజలందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఆమేఠిలో స్మృతి ఇంటిని అద్దెకు తీసుకుని నివసించారు. ఇప్పుడు సొంతంగా ఇల్లు నిర్మించుకుని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఈ సందర్భంగా పరోక్షంగా రాహుల్‌ గాంధీపై విమర్శలు చేశారు.
 

>
మరిన్ని వార్తలు