Smriti Irani Daughter Row: ఆ బార్‌ మెనూలో బీఫ్‌.. స్మృతి ఇరానీపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌

26 Jul, 2022 07:44 IST|Sakshi

గోవా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియా నుంచి, సోషల్‌ మీడియా నుంచి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే కనిపిస్తున్నాయి. తన కూతురు జోయిష్‌.. గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై ఆమె ఇప్పటికే మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే క్షమాపణలు డిమాండ్‌ చేస్తూ.. కాంగ్రెస్‌ కీలక నేతలకు లీగల్‌ నోటీసులు కూడా పంపారు. అయితే.. 

ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఉత్తర గోవా అస్సాగావ్‌లో సిల్లీ సోల్స్‌ కేఫ్‌ అండ్‌ బార్‌కు లీగల్‌ నోటీసులు జారీ చేసిన విషయాన్ని స్వయంగా గోవా ఎక్సైజ్‌ శాఖ ధృవీకరించింది. అంతేకాదు.. నిజంగానే ఇల్లీగల్‌ బార్‌ లైసెన్స్‌తో నడుస్తోందని తేల్చింది. ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి పేరిట కిందటి నెలలో లైసెన్స్‌ను రెన్యువల్‌ చేశారని నిర్ధారణ చేసుకుని మరీ నోటీసులు పంపినట్లు ప్రకటించింది. అయితే దానికి ఓనర్‌ ఎవరనే విషయంపై మాత్రం ఎక్సైజ్‌ శాఖ మౌనం వహించడం గమనార్హం.

మెనూ వైరల్‌
ఇదిలా ఉంటే.. గతంలో కూతురు నడిపించే సదరు కేఫ్‌ అండ్‌ బార్‌కు, ఆమె డిషెస్‌కు దక్కిన రివ్యూలపై స్వయంగా స్మృతి ఇరానీనే స్పందించడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన మీడియా కథనాలు, ఆమె ఇచ్చిన రివ్యూ తాలుకా స్క్రీన్‌షాట్లు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు ఆమె నడిపిస్తున్న రెస్టారెంట్‌ మెనూను సైతం కొందరు తెర మీదకు తెస్తున్నారు. #smritiiranidaughter హ్యాష్‌ ట్యాగ్‌తో పేరుతో ఆ మెనూలో బీఫ్‌ ఉండడాన్ని ప్రస్తావిస్తున్నారు. తల్లి ఫేక్ డిగ్రీలాగే.. కూతురు ఫేక్‌ లైసెన్స్‌తో అబద్ధాలతో బార్‌ నడిపిస్తోందంటూ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఇది రాజకీయపరమైన విమర్శలకు దారి తీస్తోంది. 

స్మృతి ఇరానీ భర్త జుబిన్‌ ఇరానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో ఆ కేఫ్‌కు కో-ఫౌండర్‌గా పేర్కొనడం విశేషం. మరోవైపు తమ పార్టీ ఒత్తిడి మేరకు ఈ బ్యార్‌ వ్యవహారంపై అధికారులు చర్యలు ప్రారంభించారని, అయితే సిన్సియర్‌గా వ్యవహరించిన ఓ అధికారిని ఒత్తిళ్లతో అక్కడి నుంచి బదిలీ చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన జోయిష్‌ అదంతా ఆధారాలు లేని నిందలని చెబుతోంది. తాను ఓనర్‌ను కాదని, అసలు ఆ రెస్టారెంట్‌ను తాను నడపడం లేదని, పార్ట్‌టైంగా అక్కడ రకరకాల డిషెస్‌ వండుతున్నానని జోయిష్‌ స్పందించారు.

ఇక కూతురిని టార్గెట్‌ చేసుకుని తనపై విమర్శలు గుప్పించడంపై ఇదివరకే తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. న్యాయస్థానం, ప్రజాకోర్టులో తాను సమాధానాలు కోరుతానన్నారు. సోనియా, రాహుల్‌ గాంధీ రూ.5వేలకోట్ల దోపిడీపై తన తల్లి(స్మృతినే ఉద్దేశించుకుని..) విలేకరుల సమావేశం పెట్టడమే తన కూతురు తప్పని.. 2014, 2019 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీపై తన తల్లి పోటీ చేయడమే ఆమె తప్పని స్మృతి ఇరానీ ఆరోపించారు. తన కూతురు జోయిష్‌  స్టూడెంట్‌ అని, చదువుకుంటోందని, ఆమెకు ఎలాంటి వ్యాపారాలతో సంబంధం లేదని స్మృతీ ఇరానీ మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ మాత్రం..  ప్రధాని మోదీ స్పందించి స్మృతి ఇరానీని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

ఆర్టీఐ యాక్టివిస్ట్‌గా తనకు తాను చెప్పుకునే రోడ్రిగ్యూస్‌ అనే వ్యక్తి.. బీజేపీ వ్యతిరేక చేష్టల్లో భాగంగానే కావాలనే ఈ వివాదంలోకి స్మృతీ ఇరానీ, ఆమె కూతురిని భాగం చేస్తున్నాడంటూ బీజేపీ మద్దతుదారులు చెప్తున్నారు. సోషల్‌ మీడియాలో క్యాంపెయిన్‌ అంతా కాంగ్రెస్‌ నడిపిస్తున్న కుట్రేనని ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు