వైవాహిక జీవితంపై ప్రశ్న.. ఆగ్రహంతో స్మృతి ఇరానీ సమాధానం

14 Aug, 2023 15:20 IST|Sakshi

ఢిల్లీ: స్నేహితురాలి భర్తను వివాహమాడారని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైరయ్యారు. 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే కార్యక్రమంలో భాగంగా అభిమానులు ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. తన భర్త జుబిన్ ఇరానీని వివాహమాడిన అంశాన్ని, జుబిన్ ఇరానీ మాజీ భార్య మోనా గురించి కూడా ఆమె స్పందించారు. 

అయితే.. సామాజిక మాధ్యమాల వేదికగా తరచు ఈ ప్రశ్నలు తనకు ఎదురవుతుంటాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఈసారి మాత్రం జుబిన్ ఇరానీ, మోనా గురించి మాత్రం స్పష్టంగా మాట్లాడారు. మోనాతో తనకు ఉన్న సంబంధాన్ని కూడా వివరించారు. ఈ సందర్భంగా మోనా ఇరానీ తన చిన్ననాటి స్నేహితురాలు కాదని ప్రజలకు విన్నవించారు. తనకంటే మోనా 13 ఏళ్ల పెద్దదని తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. 

'మోనా కుటుంబం రాజకీయ నేపథ్యం లేనిది. ఆమెను ఇందులోకి లాగొద్దు. నాతోనే పోరాడండి. నాతోనే వాదించండి. నా గౌరవ మర్యాదలపైనే మాట్లాడండి. కానీ ఒక అమాయక పౌరురాలిని ఇందులోకి లాగకండి. రాజకీయంగా ఏమీ సంబంధం లేని మోనాతో పోరాడకండి. ఆమె గౌరవానికి భంగం వాటిల్లవద్దు.' అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. 

స్మృతి ఇరానీ జుబిన్‌ ఇరానీని 2001లో వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు 'జోర్' కూడా ఉన్నాడు. కూతురు 'జోయిష్‌' ఉంది. జుబిన్కి మోనాతో ఇంతకుముందే వివాహం జరిగింది. వారిరువురికి 'షానెల్లే' పేరుగల కూతురు ఉంది.

ఈ కార్యక్రమంలో స్మృతి ఇరానీని తన టీవీ లైఫ్‌ గురించి కూడా ప్రశ్నించారు. రీల్‌ లైఫ్‌ను మిస్ అవుతున్నారా? అని అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. రీల్ లైఫ్ వదిలేసే నాటికి అది చాలా అద్భుతంగా అనిపించింది. కానీ ఎప్పటికీ ఆలాగే ఉంటుందని చెప్పలేమని అన్నారు. కాలం ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నేర్పిస్తోందని చెప్పారు. 

ఇదీ చదవండి: ఎడతెరిపిలేని వర్షాలు.. విరిగిన కొండచరియలతో కూలిన గుడి.. 21 మంది మృతి..

మరిన్ని వార్తలు