స్వామి అగ్నివేశ్‌ కన్నుమూత

12 Sep, 2020 04:39 IST|Sakshi

న్యూఢిల్లీ: సంఘ సేవకుడు స్వామి అగ్నివేశ్‌(80) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా లివర్‌ సిర్రోసిస్‌ వ్యాధితో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన మంగళవారం నుంచి వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌ తెలిపింది. సాయంత్రం ఆరుగంటల సమయంలో గుండెపోటు వచ్చిందని 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారని పేర్కొంది.

తెలుగువారే..
అగ్నివేశ్‌ మన తెలుగువ్యక్తే. అసలు పేరు వేప శ్యామ్‌ రావు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఓ కుగ్రామంలో 1939 సెప్టెంబర్‌ 21న జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో ఛత్తీస్‌గఢ్‌లో తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలో సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు. సామాజిక కార్యకర్తగా, ఆధ్యాత్మిక వేత్తగా పేరొందారు. బాలల వెట్టిచాకిరీ నిర్మూలన కోసం బంధ ముక్తి మోర్చా పేరుతో సంస్థను స్థాపించి ఎనలేని కృషి చేశారు.

ఆర్యసమాజ్‌ సిద్ధాంతాలకు ఆకర్షితులైన అగ్నివేశ్‌ 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1977లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికై విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు. వెట్టిచాకిరీని నిరసిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడం, ఆనాటి హరియాణా ప్రభుత్వం దానిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో అగ్నివేశ్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2010లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మావోయిస్టు నాయకులతో చర్చలు జరిపే బాధ్యతని స్వామి అగ్నివేశ్‌కే అప్పగించింది. ఆర్యసమాజ్‌ ప్రపంచ మండలికి 2014 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం
సాక్షి, అమరావతి: అగ్నివేశ్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన స్వామీ చిరస్మరణీయులన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం
సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ మరణం పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి స్వామి  మొదట్నుంచీ మద్దతుగా నిలిచారన్నారురు. అగ్నివేశ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సిక్కోలు నివాళి
శ్రీకాకుళం, సోంపేట: శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన అగ్నివేశ్‌ తన ప్రస్థానాన్ని జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లగలిగారు. ఆయన కన్నుమూతతో సిక్కోలు నివాళి అర్పించింది. బాల్యమంతా ఛత్తీస్‌గఢ్‌లోనే గడిపినా అప్పుడప్పుడూ శ్రీకాకుళం వస్తుండేవారు. ప్రధానంగా సోంపేట థర్మల్‌ ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారు. ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. సోంపేట థర్మల్‌ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో అగ్నివేశ్‌ సోంపేట, బీల ప్రాంత పరిసర గ్రామాల ప్రజలతో మాట్లాడారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు