మన లైక్‌ కౌంట్‌... ఇకపై సీక్రెట్‌

28 May, 2021 21:45 IST|Sakshi

యువతకు, సామాజిక మాధ్యమాలపై కోట్లాది మందికి మోజు పెరగడానికి ఒక ప్రధాన కారణం లైక్స్‌. తాము పెట్టే పోస్టులు, చేసే షేరింగ్స్‌...ఇంకేవైనా సరే విశ్వవ్యాప్తంగా లైక్స్‌ను కొల్లగొట్టే అవకాశం ఉండడంతో పోటా పోటీగా సోషల్‌ వీరులు చెలరేగిపోతున్నారనేది తెలిసిందే. అదే సమయంలో లైక్స్‌ తగ్గడం, పెరగడం అనేవి అనేక రకాలుగా సమస్యలు సృష్టిస్తున్న సంగతీ తెలిసిందే. ఈనేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ పై ప్రతి ఒక్కరికీ తమకు వచ్చే లైక్‌ కౌంట్స్‌ను ఇతరులకు కనబడకుండా దాచుకునే అవకాశం అందిస్తున్నట్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ప్రతినిధులు ప్రకటించారు.

సాధారణ ప్రజలతో పాటుగా నిపుణుల నుంచి విన్నదాని ప్రకారం లైక్‌ కౌంట్స్‌ అనేవి కొంతమందికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించడం లేదు, కొంతమందికి మాత్రం ఇది బాధను మిగులుస్తుంది. కొంతమంది ప్రజలు లైక్‌ కౌంట్స్‌ను ఏది ట్రెండింగ్‌లో ఉందనేది తెలుసుకోవడం కోసం  వినియోగిస్తున్నారని తేలింది. అందుకే ఈ మార్పు చేర్పులను జత చేసినట్టు వెల్లడించారు. తాము జత చేసిన కొత్త టూల్స్‌ ద్వారా తమ డీఎంల నుంచి ప్రమాదకరమైన కంటెంట్‌ను యూజర్స్‌ ఫిల్టర్‌ చేసుకునేందుకు వీలు కలుగుతుందని, అలాగే ఫేస్‌బుక్‌ న్యూస్‌ ఫీడ్‌పై తాము ఏది చూస్తున్నాం, ఏది పంచుకుంటున్నామనే అంశాలపై నియంత్రణకు సాధ్యమవుతుందని వివరించారు. ఇప్పుడు యూజర్స్‌ మరింత ప్రైవసీని, సౌకర్యాలను కోరుకుంటున్నారనీ రాబోయే కొద్ది వారాలో ఈ కంట్రోల్స్‌ అన్నీ కూడా ఫేస్‌బుక్‌పై కనిపించనున్నాయనీ వీరు తెలిపారు. 

దాచుకోండి ఇలా...
సొంత పోస్ట్‌లపై  లైక్‌ కౌంట్స్‌ను దాచుకునే అవకాశం వల్ల ఇతరులు మన పోస్ట్‌లకు ఎన్ని లైక్‌లు వచ్చాయనేది ఏ మాత్రం తెలుసుకోలేరు. దాంతో ఎవరైనా సరే మన పోస్ట్‌లకు ఎన్ని లైక్‌లు వచ్చాయన్న అంశం పై దృష్టి సారించకుండా, మనం షేర్‌ చేసే ఫోటోలు, వీడియోలపై మాత్రం దృష్టి సారించవచ్చు. సెట్టింగ్స్‌పై న్యూ పోస్ట్స్‌ విభాగాన్ని సందర్శించడం ద్వారా ఇతరుల పోస్ట్‌లపై  లైక్‌ కౌంట్స్‌ను సైతం మనం దాయవచ్చు మన ఫీడ్‌లోని అన్ని పోస్ట్‌లకూ ఇది వర్తిస్తుంది.  ఓ పోస్ట్‌ను షేర్‌ చేసే ముందే లైక్‌ కౌంట్స్‌ను హైడ్‌ చేసుకోవచ్చు.. అంతేకాదు ఈ సెట్టింగ్‌ను ఒక వేళ పోస్ట్‌ లైవ్‌లోకి వెళ్లిపోయినప్పుడు సైతం ఆప్షన్‌ ఆఫ్‌ చేయవచ్చు. ఇలాంటి అనేక మార్పులతో సోషల్‌ మీడియా మరింత కొత్తదనాన్ని సంతరించుకోనుంది.

చదవండి: ట్విటర్‌పై కేంద్రం ఆగ్రహం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు