సీఎంని కదిలించిన 10 ఏళ్ల బాలుడి పరిస్థితి.. వీడియో వైరల్‌

8 May, 2021 21:28 IST|Sakshi

చిన్నారికి పంజాబ్‌ ముఖ్యమంత్రి సాయం

తక్షణమే రూ.2 లక్షలు ఆర్థిక సాయం

కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ 

బాలుడు చదువుకునేందుకు ఏర్పాట్లు

లుధియానా: పలకా బలపం పట్టి బడికి పోవాల్సిన చిన్నారులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిక్షాటన చేయడం, లేదా చిన్ని చిన్న వస్తువులను అమ్ముకుంటున్న దృశ్యాలు మనందరికీ రోజు కనిపించేవే. అలాంటి సంఘటన ఒకటి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్‌ను కదిలించింది. వెంటనే ఆ చిన్ని తమ్ముడిని ఆదుకునేందుకు రంగంలోకి దిగిపోయారు. తక్షణమే రూ. 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. అంతేకాదు అధికారులతో మాట్లాడి ఆ బాలుడు తన చదువును కొనసాగించేలా చూడాలని ఆదేశించారు.  ఈ విషయాన్ని స్వయంగా  ముఖ్యమంత్రే ట్వీట్‌ చేశారు. 

ముఖ్యమంత్రిని కదిలించిన ఆ బాలుడి  విశేషాలు : 
పదేళ్ల వయసున్న  వన్ష్ సింగ్ అనే చిన్నారి లూధియానాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సాక్సులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండ తరగతిలోనే బడి మానేసిన బాలుడు సాక్సులమ్మి కుటుంబానికి చేయూతగా నిలుస్తున్నాడు.  దీన్ని గమనించిన  కారులోని ఒకవ్యక్తి  చిన్నారి మీద జాలితో వ్యక్తి డబ్బులివ్వడానికి ప్రయత్నించాడు. కానీ దాన్ని వన్షు తిరస్కరించాడు. దీన్ని గమనించిన  మరో వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.  ఈ వీడియోనే సీఎం కంటపడింది. వెంటనే ఆయన బాలుడితో వీడియో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడి పాఠశాలలో చేర్పించేలా చూస్తానని,  శ్రద్ధగా  చదువుకోవాలని వన్షుకి హితవు పలికారు. కుటుంబ ఖర్చులను తాను  చూసుకుంటానంటూ హామీ ఇచ్చారు.  దీంతో  అటు వన్షు ఆత్మగౌవరం, నిజాయితీ పైనా, ఇటు సీఎం  ఔదార్యంపైనా  నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అమరేందర్ సింగ్‌ను "నిజమైన సీఎం" అంటూ ప్రశాంత్ దహిభేట్ అనే ట్విటర్ యూజర్ కొనియాడారు. అలాగే పంజాబ్‌లోని ఏ పిల్లవాడూ ఇకపై చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం చూడాలని మరొకరు కామెంట్‌ చేయడం విశేషం.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు