దేశ సరిహద్దులో సైనికుల డ్యాన్స్‌ వైరల్‌

27 Mar, 2021 17:01 IST|Sakshi

లఢాఖ్‌: సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో భారత్‌ చైనా మధ్య యుద్ధం తలెత్తేలా పరిణామాలు కనిపించాయి. అనంతరం అనూహ్యంగా చైనా బలగాల ఉపసంహరణకు నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితులు శాంతంగా మారాయి. ఈ క్రమంలో భారత సరిహద్దు తూర్పు లడ్డాఖ్‌ ప్రాంతంలో కొన్ని రోజులుగా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాంగాంగ్‌ సరస్సు వద్ద సైనికులు ఆనందంలో మునిగారు. ఈ సందర్భంగా వారు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇద్దరు సైనికులు ఉత్సాహవంతంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు ట్విటర్‌లో షేర్‌ చేశారు. షేర్‌ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్‌.. వేలాది లైక్స్‌, రీట్వీట్స్‌ వచ్చాయి. లడ్డాఖ్‌ ప్రాంతంలో సైనికులు ఇంత ఆనందంలో ఎప్పుడు కనిపించలేదని కిరణ్‌ రిజుజు ఆనందం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో స్థానిక ‘పెప్పీ’ పాటను పెద్ద సౌండ్‌లో పెట్టుకుని నృత్యాలు చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైనికుల సేవలను కీర్తిస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు. ఆ వీడియోను పెద్ద సంఖ్యలో షేర్‌ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు