సరిహద్దులో పాక్ బరితెగింపు‌.. తిప్పికొట్టిన భారత్‌

1 Oct, 2020 16:31 IST|Sakshi

కశ్మీర్‌ : జమ్మూ కశ్మీర్‌ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి గురువారం ఉదయం పాకిస్థాన్ సైన్యం మరోసారి బరితెగించింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ముగ్గురు భారత సైనికులు అమరులు కాగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. కాగా పాక్ దుశ్చర్యలను భారత్ సైన్యం దీటుగా తిప్పికొట్టింది. భారత సైనిక పోస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని దాయాది కాల్పులకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్ వద్ద పాకిస్థాన్ సైన్యం మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.. మరో నలుగురు గాయపడ్డారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

పూంచ్ సెక్టార్‌ ఎల్‌వోసీ వద్ద పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ చనిపోగా, మరో సైనికుడు గాయపడ్డాడు. పాక్ సైన్యం కాల్పుల్లో గాయపడిన సైనికులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. పాక్ కాల్పులను భారత్ సమర్ధంగా తిప్పికొట్టింది. అటువైపున కూడా ప్రాణనష్టం జరిగినట్టు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ దీనిపై పాక్ ఎటువంటి ప్రకటన చేయలేదు. పాక్ కవ్వింపు చర్యలకు గట్టి జవాబిస్తోంది.

గత 17 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పాకిస్థాన్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. కేవలం తొమ్మిది నెలల్లోనే 3,600 సార్లు కాల్పులకు తెగబడినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సరిహద్దుల్లో భారత్-పాకిస్థాన్ మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందానికి పాకిస్థాన్ తరుచూ తూట్లు పొడుస్తూనే ఉంది. గతేడాది ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత నుంచి దాయాది మరింత ఆక్రోశంతో రగిలిపోతోంది. ఉగ్రవాదులను దేశంలోకి పంపి విధ్వంసం సృష్టించేందుకు దాయాది చేయని ప్రయత్నం లేదు. అయితే, వీటిని సైనికులు సమర్ధంగా తిప్పికొడుతున్నారు. (చదవండి : బాబ్రీ విధ్వంసం వెనక పాక్‌ హస్తం!)


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా