కోవిడ్‌ నుంచి కోలుకునే దశలో చర్మ వ్యాధులు 

8 Jun, 2021 03:53 IST|Sakshi

రోగ నిరోధక శక్తి తగ్గడంతో జుట్టు రాలడం, గోళ్ల సమస్యలు 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారినపడితే శరీరం బలహీనమవుతుంది. ఒంట్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఇతర వైరస్‌లు సులువుగా దాడి చేస్తాయి. కరోనా సోకిన తర్వాత కోలుకుంటున్న దశలో బాధితులకు చర్మ వ్యాధులు సోకుతున్నట్లు వైద్యులు చెప్పారు. జుట్టు అధికంగా రాలుతుందని, ప్రధానంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని, గోళ్ల వ్యాధులు తలెత్తుతున్నాయని తెలిపారు.

కరోనా బాధితుల్లో హెర్పిస్‌ అనే చర్మవ్యాధి తిరగబెడుతోందని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌కు చెందిన డెర్మటాలజిస్టు డాక్టర్‌ డి.ఎం.మహాజన్‌ చెప్పారు. హెర్పిస్‌ సోకితే నోటిపూత, చర్మంపై బొబ్బలు కనిపిస్తాయి. కోవిడ నుంచి కోలుకున్న తర్వాత కొందరు చర్మ సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారని అన్నారు. చర్మ సమస్యలను మ్యుకోర్‌మైకోసిస్‌గా (బ్లాక్‌ ఫంగస్‌) భావిస్తున్నారని తెలిపారు. ఇవి రెండూ వేర్వేరు అని, అవగాహన పెంచుకోవాలని సూచించారు. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు, ఇతర ఔషధాలు మితిమీరి తీసుకోవడం వల్ల బాధితుల్లో క్యాండిడా ఫంగస్‌ సోకుతోందని వెల్లడించారు. దీనివల్ల జననేంద్రియాలపై తెల్ల మచ్చలు కనిపిస్తాయన్నారు.  

మరిన్ని వార్తలు