ఆర్నెల్లు సమస్యలు వేధిస్తాయి 

16 Jun, 2021 04:26 IST|Sakshi

నీరసం, నిద్రలేమి, కండరాల నొప్పులు, శ్వాసలో ఇబ్బందులుంటాయ్‌  

కంగారు పడాల్సిన అవసరం లేదు 

తిరిగి శక్తిపొందడానికి ప్రొటీన్లు,తగినంత నీరు తీసుకోవాలి 

ఊపిరితిత్తులు నిపుణులు డాక్టర్‌ నిఖిల్‌

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నెగెటివ్‌ వచ్చిన అనంతరం మహమ్మారితో పోరాటం పూర్తయినట్లేనా అంటే... కాదంటున్నారు నిపుణులు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మూడు నుంచి ఆరు నెలల పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారంపై పీఐబీ నిర్వహించిన వెబినార్‌లో ఊపిరితిత్తులు, టీబీ నిపుణులు డాక్టర్‌ నిఖిల్‌ నారాయణన్‌ బాంటే, న్యూట్రిషనిస్ట్‌ ఇషా కోస్లాలు పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.  

కరోనా సెకండ్‌ వేవ్‌లో మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో పోస్ట్‌ కోవిడ్‌–19 లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారని డాక్టర్‌ నిఖిల్‌ నారాయణన్‌ తెలిపారు. 50 నుంచి 70 శాతం మంది స్వల్ప, తీవ్ర లక్షణాలతో బాధపడుతున్నారని, మూడు  నుంచి ఆరునెలల పాటు ఈ ఇబ్బంది ఉంటోందని తెలిపారు. అయితే మధ్యస్థ, తీవ్రస్థాయి కరోనాతో బాధపడిన వారే ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారని నిఖిల్‌ వివరించారు.  

పోస్ట్‌ కోవిడ్‌లో ఎదుర్కొంటున్న సమస్యలు... 
► నీరసం/అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దడ, విపరీతంగా చెమట పట్టడం, కీళ్ల నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం, నిద్రలేమి, మానసికంగా కుంగుబాటు, నిరాశ, ఆందోళన.  
పోస్ట్‌–కోవిడ్‌–19 లక్షణాలకు కారణం  
► 1. వైరస్‌ సంబంధిత: కరోనా ఒక్క ఊపిరితిత్తుల పైనే కాదు శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రభావం చూపుతుంది. కాలేయం, మెదడు, కిడ్నీలు ఇలా అన్నింటిపైనా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో శరీరం పూర్తిస్థాయిలో మహమ్మారి నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. 
► 2. రోగనిరోధక శక్తి సంబంధిత: శరీరంలోకి వైరస్‌ ప్రవేశించిన వెంటనే రోగనిరోధక శక్తి హైపర్‌ యాక్టివ్‌ అవుతుంది. వైరస్‌తో పోరాటంలో భాగంగా పలు రసాయనాలు ఉద్భవించి అవయవాల్లో మంట పుట్టిస్తుంది. కొంతమంది రోగుల్లో ఈ మంట దీర్ఘకాలం ఉంటుంది.  

ఎక్కువగా కనిపిస్తున్న లక్షణాలు:  
► త్రొంబోఎంబాలిజం: పోస్ట్‌–కోవిడ్‌–19లో ఎక్కువ భయపడాల్సిన లక్షణం. రక్తం గడ్డకట్టిన ప్రాంతాన్ని బట్టి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ లక్షణాలు ఐదు శాతం రోగుల్లోనే కనిపించాయి. 
► పల్మోనరీ ఎంబాలిజం:  ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలను ముందుగా తెలియజేస్తుంది. రక్తపోటు తగ్గిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. 
► డీ–డైమర్‌ స్థాయి ఎక్కువ: కరోనా తీవ్రమైన లక్షణాలున్న రోగులు, అధిక డీ–డైమర్‌ స్థాయి ఉన్న వారికి ఆసుపత్రిలో ఉన్న వారు 2 నుంచి 4 వారాలపాటు చికిత్స సమయం, ఆ తర్వాత కూడా  రక్తం గడ్డ కట్టడాన్ని తగ్గించే చికిత్స తీసుకోవాలి. వైద్యుల సూచన మేరకే ఈ చికిత్స పొందాలి.  
► దీర్ఘకాలిక దగ్గు: పోస్ట్‌–కోవిడ్‌–19లో ప్రధానమైన వ్యాధుల్లో దీర్ఘకాలిక దగ్గు ఒకటి. పొడి దగ్గు వచ్చే రోగులకు శ్వాస వ్యాయామాలు సిఫార్సు చేయాలి. 
► పక్కటెముకల్లో నొప్పి: పోస్ట్‌–కోవిడ్‌లో తరచుగా దగ్గు కారణంగా నొప్పులు కనిపిస్తాయి. దీర్ఘకాలిక దగ్గు వల్ల ఛాతీ దిగువ భాగంలో ఎడమవైపు పక్కటెముకల్లో నొప్పులు రావచ్చు.  ఈ లక్షణాలు గుర్తించడం ఎంతో అవసరం.  
► పల్మోనరీ ఫైబ్రోసిస్‌: పోస్ట్‌ కోవిడ్‌లో మరో ప్రధానమైన లక్షణం. కరోనా నుంచి ఊపిరితితుత్తులు రికవరీ అయ్యే క్రమంలో మచ్చలు ఏర్పడతాయి. పది శాతం మంది రోగులు దీర్ఘకాలం ఆక్సిజన్‌ తీసుకోవాల్సి వస్తోంది. 70 శాతంపైగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న రోగుల్లో ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అయితే ఆ రోగుల్లో కూడా పల్మోనరీ ఫైబ్రోసిస్‌ ఒక శాతం మందిలోనే వెలుగుచూసింది.  
మోడరేట్, తీవ్ర లక్షణాలతో ఆక్సిజన్‌ థెరపీ తీసుకున్న వారిలో కోలుకున్న నెలరోజుల తర్వాత ఊపిరితిత్తులు పూర్తిగా పునరుద్ధరణ అయ్యాయా లేదా అనే దానిపై పరీక్ష చేయించుకోవాలి. కరోనా నుంచి కోలుకున్నవారు ఛాతినొప్పి వస్తే గుండెపోటు వస్తోందని భయపడుతున్నారు. కానీ కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో మూడు శాతం కన్నా తక్కువ మందికే గుండెపోటు వచ్చింది.  

పోషణ నిర్వహణ సూచనలు  
► కరోనా కారణంగా మరణించిన వారిలో 94 శాతం మంది సహ అనారోగ్యాల కారణంగానే మరణించారని క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌ ఇషా కోస్లా తెలిపారు. తగిన ఆహారం తీసుకొని రోగనిరోధక శక్తి కాపాడుకోవాలని ఆమె సూచించారు. మసాలాలు లేకుండా సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. రెండు పూటలా  ఆహారంలో తప్పకుండా ప్రొటీన్లు  ఉండేలా చూసుకోవాలి.  
► జింకు, విటమిన్‌–సి, డి, బి కాంప్లెక్స్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. శరీరం తిరిగి శక్తిపొందడానికి ఇవెంతో ఉపకరిస్తాయి.  
► రెయిన్‌బో డైట్‌ ఎంతో అవసరం. ఇవి ఏయే జన్యువులు పనిచేయాలి. వేటిని అణచివేయాలనేది త్వరగా గుర్తిస్తాయి.  వేర్వేరు రంగుల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. రంగురంగుల ఆహారం కనీసం ఒక భోజనంలోనైనా తీసుకోవాలి. రక్షిత ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ– ఇన్‌ఫ్లమేటరీ, కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్స్, పసుపు, అల్లం, టీ ఉండాలి.
► హైడ్రేషన్‌: శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా తగినంత నీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. 

మరిన్ని వార్తలు