కరోనా: ఈ మందులు వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

28 Apr, 2021 12:30 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఐబూప్రూఫెన్‌ లాంటి కొన్ని పెయిన్‌ కిల్లర్లు కరోనా కారక ఇబ్బందులను మరింత పెంచుతాయని, హృద్రోగ, కిడ్నీ పేషెంట్లకు ఇవి ప్రమాదకారులని ఐసీఎంఆర్‌ హెచ్చరించింది. కరోనా సమయంలో నొప్పుల బాధకు ఎన్‌ఎస్‌ఏఐడీఎస్‌ (నాన్‌ స్టిరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డగ్స్ర్‌)ను తీసుకోవద్దని, వీటి బదులు అవసరమైతే పారసిటమాల్‌ టాబ్లెట్లను వాడాలని సూచించింది. బీపీ, సుగర్, హృద్రోగులు కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఐసీఎంఆర్‌ కొన్ని సూచనలు చేసింది.

సూచనలు, సలహాలు...
► బీపీకి వాడే ఏసీఈ ఇన్‌హిబిటర్లు(రామిప్రిల్‌ లాంటివి) కానీ, ఏఆర్‌బీలు(లోసార్టిన్‌ లాంటివి) కానీ కరోనా తీవ్రతను పెంచుతాయనేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవు. నిజానికి ఈ మందులు హృదయం పనితీరుకు మేలు చేయడంతోపాటు, అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. అందువల్ల సొంతంగా వీటిని మానేయాలనే నిర్ణయం తీసుకోవద్దు. అలా చేస్తే హృదయ సంబంధిత ముప్పు పెరుగుతుంది.
►  కరోనా సోకిన రోగుల్లో 80 శాతం మందికి శ్వాససంబంధిత ఇన్‌ఫెక్షన్లు సాధారణంగా కనిపిస్తాయి. అయితే షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలున్నవారికి ఈ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ముప్పు అధికమనే వాదన ఉంది. కానీ ఈ వాదన నిజం కాదు. ఈ సమస్యలున్నవారిలో కొందరికి మాత్రం కోవిడ్‌ లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. అందువల్ల ఈ బాధలున్నవారు అధిక జాగ్రత్త తీసుకోవడం మంచిదే! షుగర్‌ అదుపులోలేని వ్యక్తులకు ఇన్‌ఫెక్షన్ల రిస్కు ఎక్కువ. 
► కోవిడ్‌ సోకినా సరే ఇప్పటికే వివిధ సమస్యలకు మందులు వాడుతున్నవారు వాటిని కొనసాగించాలి, కేవలం డాక్టర్‌ సూచిస్తేనే మానేయాలి.
►  సమూహాల్లోకి వెళ్లేటప్పుడు మాస్కు తప్పనిసరి. మాస్కును మూతి, ముక్కు, గడ్డం కవర్‌ చేసేలా ధరించాలి. దీంతోపాటు, సామాజిక దూరం పాటించడం వల్ల కోవిడ్‌ను కంట్రోల్‌ చేయవచ్చు.
► కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే గైడ్‌లైన్స్‌ ప్రకారం ఐసోలేషన్‌ పాటించాలి, పరిస్థితి విషమిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి.
► మద్యపానం, ధూమపానం మానేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, క్రమబద్దమైన వ్యాయామం చేయడం, బీపీ, సుగర్‌ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం, కరోనా గైడ్‌లైన్స్‌ను కచ్ఛితంగా పాటించడం ద్వారా ప్రజలు కరోనాను కట్టడి చేయవచ్చు.

చదవండి: Last 24 Hours: అక్కడ ఒక్క మరణం కూడా నమోదు కాలేదు

మరిన్ని వార్తలు