-

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు 

31 Jul, 2020 03:52 IST|Sakshi

ఏపీ రాజధానిపై రాష్ట్ర బీజేపీ నూతన సారథి సోము వీర్రాజు

ప్రధాని మోదీ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని వెల్లడి

‘చంద్రబాబుకు ఏదో ఫోన్‌ రాగానే అమిత్‌ షా నుంచి వస్తోందంటూ లోపలికి వెళ్తున్నారట.

బీజేపీ చంద్రబాబు వద్దకు వెళ్లిపోతోందని నమ్మించే ప్రయత్నం అది’ – సోము వీర్రాజు 

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆలోచనా విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతంగా ముందుకు తీసుకెళతామని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కేంద్రానికి రాజధానితో సంబం ధం లేదని స్పష్టం చేశారు. గతంలో మూడు రాష్ట్రా లు ఏర్పడినప్పుడు కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. రాష్ట్ర పార్టీ మాత్రం రాజధానికి మద్దతుగా ఉంటుందన్నారు. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడైనా రాజధాని కట్టే సందర్భంలో కేంద్ర జోక్యం అనే ప్రశ్న వచ్చిందా?.. రాదు.. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు.

మూడు రాజధానులంటే మమ్మల్ని కలగజేసుకోమంటున్నారు. కేంద్రం ఏ విషయంలో కలగజేసుకుంటుంది? ఇళ్లు ఇచ్చే విషయంలో కలగజేసుకుంటుంది. ఇంటికి రూ. 1.5 లక్షలు కేంద్రం ఇస్తోంది. ఇదీ కలగజేసుకోవడమంటే. చంద్రబాబు రాజధాని నిర్మాణం ఉందంటే, రమ్మంటేవెళ్లాం. రిబ్బన్‌ కత్తిరించాం. ఇప్పుడు ఈయన (సీఎం జగన్‌) మూడంటున్నారు. మూడు రాజధానులంటే మీరు కలగజేసుకుంటారా? లేదా? అని టీడీపీ నేతలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. రాజధాని అక్కడ ఉండాలని చెబుతున్నాం. రైతులకు మా మద్దతు ఉంటుందని చెబుతున్నాం. అంతేగానీ ఏది మీరు నిర్ణయిస్తే, మీరు ఏది ఉద్యమంగా నిర్మాణం చేస్తే దానికి వంతపాడాలా? మీరు మమ్మల్ని ఇరుకునపెట్టేలా ప్రయత్నిస్తే జడుసుకునే పార్టీ కాదు మాది’ అని వీర్రాజు తెలిపారు. 

మరిన్ని వార్తలు